- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి పనికీ ఓ రేటు.. లేదంటే లేటు..
దిశ, నారాయణఖేడ్ : ప్రభుత్వం ఏది ఉన్నా మా తీరు మాత్రం మారదు. మీకు పని కావాలంటే మాకు పైసలు ఇవ్వాల్సిందే.. ఇవ్వకపోతే మీ ఫైల్ అసలు కదలదు. ఇది నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్, నాగల్ గిద్ద, మనూర్, సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్, నిజాంపేట, పెద్ద శంకరంపేట రెవెన్యూ కార్యాలయాల్లో అధికారుల తీరు. జిల్లా పరిషత్ లో కూడా పలుమార్లు చర్చకు వచ్చింది. అయినా ఈ వసూల్ దందా ఆగలేదు. రెవెన్యూ అధికారులు రైతుల వద్ద రిజిస్ట్రేషన్లకు డబ్బులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించి తప్పు చేసిన అధికారులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అవినీతికి అడ్డగా ఖేడ్ రెవెన్యూ డివిజన్..
తహశీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారిపోయాయి. నారాయణఖేడ్ డివిజన్ లో సుమారు 40 వరకు ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. నాగల్ గిద్ద మండలంలో అధికంగా 30 పైనే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒక గుంట, రెండు గంటలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కు రూ.10 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది వసూళ్ల పర్వం సాగుతోంది. అక్కడ పని జరగాలంటే పైసల్ ముట్టాల్సిందే. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరి వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీసులో ముఖ్య అధికారి ఆదేశాలతోనే సిబ్బంది తమ దందా నిర్వహిస్తున్నారని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. రైతులు, ప్రజలు పనిమీద తహశీల్దార్ ఆఫీస్ కు రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. ల్యాండ్ కన్వెన్షన్ లో ప్రభుత్వానికి చెల్లించే ప్లీజ్ కంటే మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి కార్యాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
ఖేడ్ నియోజకవర్గంలో..
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 8 తహశీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. 2020 నవంబర్ నుంచి రిజిస్ట్రేషన్ కొనసాగుతున్నాయి. మ్యుటేషన్, భూమి ఆన్ లైన్, పాస్ పుస్తకాల మంజూరు, వ్యవసాయ బోర్లకు అనుమతి, ఇలా ప్రతి పనికి రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఇక్కడి సిబ్బందిని సంతృప్తి పరిస్తేనే ఫైలు సజావుగా కదులుతుందని చెబుతున్నారు. ఆఫీసులో ముఖ్య అధికారి ఆదేశాలతోనే లంచాల కథ కొనసాగుతోందని సమాచారం. గత కొంతకాలం నుంచి సామాన్యులు, రైతులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాలంటే జంకుతున్నారు. దళారులను, పైరవీ కారులను కలిశాకే తహశీల్దార్ కార్యాలయంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితులున్నాయి. ప్రతి పని కో రేటు నిర్ణయించి దళారులు చెప్పిన విధంగానే ఇస్తేనే పనులు సాఫీగా జరుగుతున్నాయి. లేదంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఏ పని కావాలన్నా పైరవీకారులు చెప్పాలి. కిందిస్థాయి సిబ్బందితో పాటు ఆఫీస్ కు సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తులు రైతులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా మధ్యవర్తులను ప్రోత్సహిస్తూ వారి ద్వారా వచ్చే రైతుల రిజిస్ట్రేషన్లకు అధిక మొత్తంలో వసూలు చేస్తూ పనులు పూర్తి చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఆయన ఆదేశాలతోనే వసూళ్లు...!
తహశీల్దార్ కార్యాలయ ముఖ్య అధికారి ప్రతి పనికి రేటు కట్టి యథేచ్ఛగా మామూళ్ల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు లంచం తీసుకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కు వచ్చిన రైతు నుంచి కార్యాలయంలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని అధికారులు నియమించారు. సదర్ సిబ్బంది రిజిస్ట్రేషన్ కు వచ్చిన రైతుల నుంచి 5 వేల నుంచి 7 వేల వరకు డాక్యుమెంట్ వారీగా వసూలు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసే విషయంలో అధికారులు ఎక్కడ విలువను బట్టి డబ్బులు మాట్లాడుకుని వసూలు చేస్తున్నారు. ల్యాండ్ కన్వెన్షన్ లో ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ. 20 వేలు ఉంటే అధికారులు ల్యాండ్ కన్వెన్షన్ చేసుకున్న వ్యక్తుల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే అనేక కొర్రెలు పెట్టి రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అవినీతి ఆరోపణలతో బదిలీలు..
నారాయణఖేడ్ డివిజన్ అవినీతికి మారుపేరుగా ఉంది. నాగల్ గిద్ద మండలంలో అనేకంగా ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ మండలంలో అసైన్డ్ భూములను సైతం దొంగ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వచ్చిన తహశీల్దారులు అవినీతి ఆరోపణలతో బదిలీ చేసుకుంటున్నారు. లాంగ్ లీవ్ పెట్టుకుని ట్రాన్స్ఫర్ అవుతున్నారు. నిజాంపేట తహశీల్దార్ మండలంలో దొంగ రిజిస్ట్రేషన్లు అవినీతి ఆరోపణలతో తహశీల్దార్ బదిలీ పై వెళ్లారు. నారాయణఖేడ్ ఆర్డీవో నుంచి డీఏఓ నిజాంపేట ఇన్చార్జి తహశీల్దార్ గా పని చేస్తున్నారు. నారాయణఖేడ్, మనూర్, కల్హేరు , పెద్ద శంకరంపేట, సిర్గాపూర్, కంగ్టి ఇదే పరిస్థితి నెలకొంది. నాగల్ గిద్దలో తహశీల్దార్ రెండు నెలల క్రితం వచ్చిన కొన్ని రోజులకే లాంగ్ లీవ్ పెట్టారు. ఇక్కడున్నా నాయబ్ తహశీల్దార్ గ్రూపువన్ ఎగ్జాం కోసం లీవ్ లో వెళ్లారు. అక్కడ ఖాళీగా ఉండడంతో మనూర్ నాయబ్ తహశీల్దార్ నాగల్ గిద్ద ఇన్చార్జిగా పనిచేశారు. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన నాయబ్ తహశీల్దార్ ప్రస్తుతం ఎమ్మార్వో ఇంచార్జ్ ఉన్నారు.
2020 నుంచి 15 మంది పైనే తహశీల్దారుగా పని వేసి వెళ్ళిపోతున్నారు. అందులో ఎక్కువ ఇంచార్జి తహశీల్దారు గా పనిచేశారు. ఆరు నెలలకొక మారు వెళ్లిపోతున్నారు. ఇక్కడ ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరగడంతో అవినీతికి మారింది. గుంటల రిజిస్ట్రేషన్లు జరగడంతో ఎక్కువ డిమాండ్ తో డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అసైన్డ్ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నాగల్ గిద్ద మండలం షాపూర్ శివారులో 73 సర్వే నంబర్ గ్రామానికి చెందిన రత్నమ్మ , సాగర్, మొనప్ప, ఇరన్న మా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తహశీల్దార్ కు పలుమార్లు తెలిపినా ఫలితం లేకపోయింది అన్నారు. ఈ మండలంలో అన్ని ఫామ్ ల్యాండ్ వారి ప్లాట్లు తీసుకున్న వ్యక్తులు తమకు ప్లాట్లు దొరకడం లేదని అనేకసార్లు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.
జనాలతో దురుసు ప్రవర్తన..!
ప్రతిరోజు నియోజకవర్గంలోని ఆయా మండలాల గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వస్తుంటారు. ప్రజలు భూ సంబంధిత, పలు సర్టిఫికెట్ల జారీ తదితర విషయాల గురించి కార్యాలయం సిబ్బందిని అడిగితే చెప్పకపోగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని సిబ్బందిని నిలదీస్తే మీ దిక్కున చోట చెప్పుకోమని తెగేసి చెబుతున్నారని పలుగ్రామాల ప్రజలు వాపోతున్నారు. కార్యాలయం సిబ్బంది పనితీరుపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కార్యాలయం అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించని, దురుసుగా ప్రవర్తిస్తున్న కార్యాలయ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.