Paris Olympics : నిఖత్ పంచ్ అదిరేనా?.. తొలిసారి ఒలింపిక్స్ బరిలో తెలంగాణ బాక్సర్

by Harish |
Paris Olympics : నిఖత్ పంచ్ అదిరేనా?.. తొలిసారి ఒలింపిక్స్ బరిలో తెలంగాణ బాక్సర్
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం దక్కే అవకాశం ఉన్న క్రీడల్లో బాక్సింగ్ ఒకటి. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. ఆ మూడు కాంస్యాలే. ఈ సారి పతకం రంగు మారుతుందనే ఆశ బలంగా ఉంది. అందుకు కారణం తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పోటీలో ఉండటమే. ఈ నిజామాబాద్ అమ్మాయిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆమెకు ఇదే తొలి ఒలింపిక్స్ క్రీడలు. స్వర్ణ పతకమే లక్ష్యంగా నిఖత్ విశ్వక్రీడల్లో అడుగుపెట్టబోతున్నది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున ఆరుగురు బాక్సర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళల విభాగంలో నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), జాస్మిన్(57 కేజీలు), లవ్లీనా బోర్గోహైన్(75 కేజీలు) పోటీపడుతున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్(51 కేజీలు), నిశాంత్ దేవ్(71 కేజీలు) బరిలో ఉన్నారు. నిఖత్ జరీన్‌‌పై పతక ఆశలు భారీగా ఉన్నాయి. కొంతకాలంగా ఆమె నిలకడగా రాణిస్తుండటమే అందుకు కారణం. వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గింది. ఇప్పుడు ఆమె లక్ష్యం పారిస్ ఒలింపిక్స్.

సంచలనాల నిఖత్

నిఖత్ జరీన్ అంటే సంచలనాలే గుర్తొస్తాయి. బాక్సింగ్‌లో ఆమె తనదైన ముద్ర వేసింది. 2011 వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్ నుంచి క్రీడలో ఆమె వేగంగా ఎదిగింది. 2015లో సీనియర్ నేషనల్ చాంపియన్‌గా నిలిచిన ఆమె ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. భారత దిగ్గజం మేరీ కోమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విభాగంలోనే నిఖత్ పోటీపడుతుండటంతో ఆమెకు మొదట్లో అవకాశాలు దక్కలేదు. క్రమంగా ఆమె మేరీ కోమ్ వారసురాలిగా పేరు తెచ్చుకుంది. 2022‌ సంవత్సరం ఆమె కెరీర్‌లో ఎంతో కీలకమని చెప్పొచ్చు. ఆ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. 52 కేజీల కేటగిరీలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లోనూ మెరిసింది. 50 కేజీల కేటగిరీలో స్వర్ణం సాధించింది. గతేడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్ హోదాను నిలబెట్టుకుంది. వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. అలాగే, ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గి పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించింది. ఆ తర్వాత నిఖత్ తన అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో రజతం సాధించింది. మేలో జరిగిన ఎలోర్డా కప్‌, జూన్‌లో జరిగిన గ్రాండ్ పిక్స్ టోర్నీలో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. నిలకడగా రాణిస్తున్న నిఖత్ పారిస్ విశ్వక్రీడల్లోనూ సత్తాచాటాలని భావిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed