ఆసీస్ రెండో టెస్టుకు మరో టీమిండియా క్రికెటర్ దూరం..?

by Vinod kumar |
ఆసీస్ రెండో టెస్టుకు మరో టీమిండియా క్రికెటర్ దూరం..?
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. 132 పరుగుల భారీ ఆధిక్యంతో తొలి వన్డేలో ఇండియా విజయం సాధించింది. రెండో టెస్టు మ్యాచ్ ఈనెల 17 నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతుంది. రెండో టెస్టును ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండో టెస్టులో విజయం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

అయితే మొదటి టెస్టులో తుది జట్టులో అవకాశం రాని.. జయదేవ్ ఉనద్కత్‌‌ను ఇప్పటికే రెండో టెస్టు నుంచి సెలక్టర్లు తప్పించిన విషయం తెలిసిందే. అయితే అతను సౌరాష్ట్ర తరపున రంజీ ఫైనల్స్‌లో ఆడేందుకు వెళ్లనున్నాడు. ఇప్పుడు మరో ప్లేయర్ సైతం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌ను రెండో టెస్టు నుంచి సెలెక్టర్లు తప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నాడు. ట్రైనర్ రజనీకాంత్ పర్యవేక్షణలో ఎన్‌సీఏలో శ్రేయాస్ శిక్షణ పొందుతున్నాడు.

Advertisement

Next Story