- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త జాతులకు ప్రముఖుల పేర్లు !
దిశ, ఫీచర్స్ : మహారాష్ట్రలో ఇటీవల రెండు కొత్త జాతి సాలీళ్లను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇందులో ఓ స్పైడర్‌కు 26/11 టెర్రరిస్ట్ దాడిలో అమరుడైన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తుకారాం ఓంబుల్ పేరుపెట్టడం విశేషం. ముంబై ఉగ్రవాద దాడుల్లో కీలకపాత్రధారి కసబ్‌ను పట్టుకునేందుకు తుకారాం తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో 23 బుల్లెట్లు అతడి దేహాన్ని చీల్చినా వెనక్కి తగ్గని తుకారం వీరమరణం పొందాడు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ఇచ్చి గౌరవించగా, తాజాగా కనుగొన్న న్యూ స్పీసియస్ స్పైడర్‌కు ‘ఐసియస్ తుకారాం’ అని పేరు పెట్టడం విశేషం. ఈ నేపథ్యంలో వివిధ సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు, సంస్థలు, శాస్త్రవేత్తలు.. సమాజానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తుల పేర్లను కొత్త జీవజాతులకు పెడుతుంటారు. ఈ జాబితాలో సర్ డేవిడ్ అటెన్‌బరో నుంచి బరాక్ ఒబామా వరకు ఎంతోమంది ప్రముఖులున్నారు. ఆ వివరాలు మీకోసం!
ప్రతి సంవత్సరం 17వేల నుంచి 24వేల జంతు జాతులను పరిశోధకులు గుర్తిస్తున్నారని అంచనా. మరి వీటికి పేర్లు పెట్టాలంటే కాస్త కష్టమైన పనే! దీన్ని సులువు చేయడానికి స్వీడిష్ ప్రకృతి శాస్త్రవేత్త కరోలస్ లిన్నెయస్ 1750లో జనరిక్, స్పీసియెస్ నేమ్స్ ఆధారంగా పేర్లు పెట్టే వ్యవస్థను రూపొందించాడు. అతడు తన జీవితకాలంలో దాదాపు 12వేల జాతుల మొక్కలు, జంతువులకు నామకరణం చేయడం విశేషం. లిన్నెయస్ అందించిన భావన చాలా సరళమైంది, ఆమోదయోగ్యమైంది కావడంతో దాన్ని మిగతా పరిశోధకులు అనుకరించారు. అయితే కొత్త జాతులను గుర్తించే శాస్త్రవేత్తలు సాధారణంగా ఆ జంతువు ప్రత్యేక లక్షణాలను లేదా అది దొరికిన స్థలాన్ని బట్టి నామకరణం చేస్తారు. ఈ క్రమంలోనే సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లను కొత్తగా గుర్తించిన జీవజాతులకు పెడుతుంటారు. పేర్లు అవమానించిడానికి పెట్టరని, వారు చేసిన సేవలను గుర్తించి గౌరవార్థం పెడుతుంటారని పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల జాతి పేరుకు ప్రత్యేకత దక్కతుందని, ఇది జాతుల ఇంటిపేరు లాంటిదని వారన్నారు.
డేవిడ్ అటెన్‌బరో :
ప్రసిద్ధ బ్రాడ్‌కాస్టర్, ప్రకృతి ప్రేమికుడు సర్ డేవిడ్ అటెన్‌బరో భూగోళంలోని ప్రకృతి రహస్యాలను విశదీకరించిన గొప్ప శాస్త్రవేత్తగా మన్ననలు అందుకున్నాడు. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేసి,ఎన్నో పుస్తకాలు రాశారు. అలాగే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకోగా 2019లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నాడు. ఈ ప్రకృతి శాస్త్రవేత్త చేసిన సేవలకు గానూ సజీవంగా ఉన్న అనేక జీవాలకు అటెన్ బరో పేరు పెట్టారు. జాగ్లోసస్ అటెన్‌బరో, మైక్రోలియో అటెన్‌బరో, డేవిడ్ అటెన్‌బరో ప్లెసియోసర్ కొన్ని ఉదాహరణలుగా చెప్పొచ్చు. ‘అతడి పేరు మీద ఓ జాతి మొత్తానికి అటెన్‌బరోసరస్ పేరు పెట్టారు. ఇక వందల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ప్లెసియోసర్(ఓ రకమైన డైనోసార్) జీవులకు ఆయన పేరు సముచితమే. చిన్నప్పటి నుంచి అతనికి లియాసిక్ ప్లెసియోసర్‌లపై అమితమైన ఇష్టం ఉండేది. ఇది మనం అతడికిచ్చిన గౌరవం’ అని అమెరికాకు చెందిన యుఎస్ పాలియోంటాలజిస్ట్ రాబర్ట్ బెక్కర్ అన్నాడు.
కేట్ విన్సెలెట్ బీటిల్ :
కారాబిడే కుటుంబానికి చెందిన బీటిల్స్‌లో దాదాపు 40వేల పైగా జాతులున్నాయి. అయితే సరికొత్తగా గుర్తించిన ఈ కుటుంబానికి చెందిన ఓ బగ్‌కు కీటకాలజిస్టులు ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ విన్సెలెట్ పేరు మీదుగా ‘ఆగ్రా కేట్ విన్సెలెట్’గా నామకరణం చేశారు. ‘టైటానిక్’ చిత్రంలోని ఆమె నటనకు ఈ గౌరవం దక్కింది. బీటిల్‌ను కనుగొన్న కీటక శాస్త్రవేత్త టెర్రీ ఎర్విన్, అటవీ నిర్మూలన ద్వారా బీటిల్‌కు ముప్పు పొంచి ఉందని వివరించాడు. వర్షారణ్య ప్రాంతాలన్నీ పచ్చిక బయళ్లుగా మారితే ఈ కీటకజాతి ఆ గడ్డి నేలపై జీవనాన్ని సాగిస్తాయని తెలిపాడు.
ఒబామా చేప :
పసిఫిక్ మహాసముద్రం క్యూర్ అటోల్ ద్వీపంలో కనుగొన్న అరుదైన చేపకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు పెట్టారు. పసుపు, గులాబీ రంగులో ఉన్న ఈ కోరల్ రీఫ్ చేపలను హవాయ్‌లోని పహనౌముకాకియా మెరైన్ నేషనల్ మాన్యుమెంట్‌లో గుర్తించగా, వీటికి ‘టొసానాయిడ్స్ ఒబామా’అనే పేరు ఖరారు చేశారు. మగ చేపలపైన ఒబామా ప్రచార లోగోను పోలిన గుర్తు ఉండటంతో పాటు, పహనౌముకాకియా విస్తీర్ణం పెంచడానికి ఒబామా కృషి చేశాడు. ప్రకృతిని రక్షించడానికి ఒబామా తీసుకున్న ఈ నిర్ణయానికి గానూ బిషప్ మ్యూజియానికి చెందిన శాస్త్రవేత్త రిచర్డ్ పైల్ తెలిపారు.
ప్రిన్స్ చార్లెస్ ఫ్రాగ్ :
ఈక్వెడార్‌లో ప్రపంచానికి తెలియని కప్ప జాతిని 2012లో గుర్తించగా, ప్రిన్స్ చార్లెస్ గౌరవార్థం దీనికి ‘హైలోస్కిర్టస్ ప్రిన్స్ చార్లెస్’గా పేరు పెట్టారు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ కారణంగా వీటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉందని, వీటిని రక్షించాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఒక కొత్త జాతికి ఒకరి పేరు పెట్టడం చాలా అసాధారణం, కానీ ఇది ప్రిన్స్ గౌరవార్థం ప్రత్యేకమైనదిగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వర్షారణ్యాలను కాపాడటానికి చార్లెస్ దశాబ్దాలుగా ప్రచారం చేయడంతో పాటు, రెయిన్‌ఫారెస్ట్ దేశాలైన బ్రెజిల్ ఇండోనేషియాలో ప్రభుత్వ హౌజ్‌లలో ప్రసంగాలు చేశాడు. అంతేకాదు అటవీ నిర్మూలన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ‘రెయిన్‌ఫారెస్ట్ ప్రాజెక్ట్’ను ప్రారంభించాడు. ఈ సమస్యను హైలైట్ చేయడానికి ఓ వీడియోలో యానిమేటెడ్ కప్పతో నటించి, ప్రజల్లోనూ అవగాహన కల్పించాడు. వాటి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆ కప్పకు చార్లెస్ పేరు పెట్టారు.
బాబ్ మార్లే పారసైట్ :
జమైకా గాయకుడు, పాటల రచయిత, మ్యూజిషియన్ బాబ్ మార్లే తన సంగీతంతో ప్రపంచాన్ని పరుగులు పెట్టించాడు. యువతలో ప్రకంపనలు పుట్టించాడు. ఒక దశాబ్దం పాటు జనాదరణ పొందిన సంగీత సారథుల్లో ఒకడిగా నిలిచాడు మార్లే. జమైకా సంగీతం, సంస్కృతి, ఐడెంటిటికీ ప్రపంచ చిహ్నంగా మారిపోవడంతో పాటు, లోకమంతా జమైకా వైపు దృష్టిసారించేలా చేశాడు. సంగీత కెరటంలా ఎగిసిపడిన ఈ జమైకన్ మ్యూజిషియన్ సేవలకుగానూ అతడి పేరు మీద ఓ పరాన్నజీవికి ‘గ్నాథియా మార్లే’ అని పేరు పెట్టారు. కరేబియన్ దిబ్బల్లోని చేపలను తినే ఒక చిన్న క్రస్టేసియన్ పరాన్నజీవి ‘గ్నాథియా’ కాగా, దీన్ని అర్కాన్సాస్ యూనివర్సిటీలోని జీవశాస్త్రవేత్త పాల్ సికెల్ గుర్తించాడు. మార్లే సంగీతమంటే నాకు ఎనలేని గౌరవం. అతడిపై ఉన్న అభిమానం కారణంగానే ఈ పారాసైట్‌కు మార్లే పేరు పెట్టాను. నిజంగా ఇది నా అదృష్టం’ అపి సికెల్ అన్నారు.
బియాన్సీ హార్స్ ఫ్లై :
అమెరికన్ పాప్ స్టార్ బియాన్సీ తన పాటలతో యావత్ ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. అత్యధిక గ్రామీ అవార్డులు దక్కించుకున్న గాయనిగా బియాన్సీ ఇటీవలే సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్‌లో గుర్తించిన అరుదైన ‘హార్స్ ఫ్లై’ కీటకానికి ‘స్కాప్టియా బియోన్సీ’గా ఆమె పేరును పెట్టడం విశేషం. ఈ ఆస్ట్రేలియన్ హార్స్ ఫ్లై వాస్తవానికి 1981లో కనుగొన్నా, 2011 వరకు దానిపై ఎటువంటి అధ్యయనాలు జరగలేవు. ఈ క్రమంలోనే సంగీత ప్రపంచంలో బియాన్సీ ఓ పసిడి గనిగా భావించిన శాస్త్రవేత్త బ్రయాన్ లెస్సార్డ్, బంగారు వర్ణాల్లో మెరిసిపోయే హార్స్ ఫ్లై కీటకానికి ఆమె పేరు సూచించాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, బ్రిటీష్ ఎథాలాజిస్ట్ రిచర్డ్ డాకిన్స్, హాలీవుడ్ యాక్టర్ డికాప్రియో, ప్లేబాయ్ మ్యాగజైన్ ఫౌండర్ హ్యూజ్ హెఫ్నర్, యాక్టర్ ఇడ్రిస్ ఎల్బా, నటి గ్రెటా గార్బో, స్పైడర్ మ్యాన్ యాక్డర్ టోబే మాగ్వైర్, యాక్టర్, కమెడియన్ జాన్ క్లీస్ లెముర్ వంటి ఎంతోమంది ప్రభావవంతమైన వ్యక్తుల గౌరవార్థం కొత్త జీవులకు వారి పేర్లు పెట్టారు.
బైబిల్ కాలం నుంచి ‘ఇజ్రాయెల్’ యూదులకు ప్రత్యేక ప్రాంతం. ఎంతో పవిత్రమైన ఆ యూదు భూమి (ఇజ్రాయెల్)ని పర్యటించిన(2017) తొలి భారతీయ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మైత్రికి సూచకంగా.. భారత్‌లో ఆనాటి యూదుల చరిత్రకు సంబంధించిన కళాఖండాలను మోదీ ఇజ్రాయెల్ దేశ ప్రధానికి కానుకగా ఇవ్వగా, ఈ నేపథ్యంలోనే ఆ దేశంలో ప్రసిద్ధి చెందిన ‘క్రైసాంథెమమ్’ అనే జాతి పువ్వుల్లోని స్థానిక రకం పువ్వుకు మోదీ పేరు పెట్టడం విశేషం.