ఫసల్ బీమా.. ఏదీ పైసల్ ధీమా?

by Shyam |   ( Updated:2023-02-04 12:13:57.0  )

కేంద్రం వైఖరి పేరు గొప్ప ఊరు దిబ్బలా తయారైంది. రైతుల కోసం ఎంతో చేస్తున్నామన్న వారి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నో పథకాలతో రైతులను ఆదుకుంటున్నామని జబ్బలు చరచుకుంటున్నా వారికి సరైన న్యాయం చేయలేకపోతున్నారు. వారు తీసుకువచ్చిన పథకాల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని గమనిస్తే ఏవిధంగా ప్రయోజనాలు అందిస్తున్నారన్న తెలుస్తోంది. ఫసల్ బీమా యోజనపై దేశవ్యాప్తంగా భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ తెలంగాణలో ఇంకాస్త డిపరెంట్‌‌ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే రెండేళ్ల నుంచి రూ.6.63 కోట్ల పంట బీమా ప్రీమియం దక్కించుకున్న కంపెనీలు, గత రబీ సీజన్‌లో 4,212 ఎకరాల్లో వరి పంట నష్టపోతే ఏడాది నుంచి రైతులకు పరిహారం అందించకపోవడం గమనార్హం.

బీమా కోసం రూ. 6.63 కోట్లు

ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో 2016లో కేంద్రం.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీంలో రబీ పంటల విలువలో 2శాతం, ఖరీఫ్ పంటలకు 1.50శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5శాతం ప్రీమియాన్ని రెతులు చెల్లిస్తే మిగిలింది ప్రభుత్వం చెల్లిస్తోంది. వరికి ఎకరానికి రూ.680, పత్తికి రూ.1750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు పంటలు నష్టపోతే గ్రామాన్ని యూనిట్‌గా, మిగిలిన పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. అయితే యాదాద్రి భువనగిరిజిల్లా‌లో 17మండలాల్లో 1.83 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉండగా 2,97,797 మంది రైతులున్నారు. వీరిలో 95వేల మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. 2018నుంచి ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి 30,671 మంది రైతులు పంటల బీమా కోసం కంపెనీలకు రూ.6.63కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు మూడు సీజన్లలో మూడు బీమా కంపెనీలు మారడంతో పంట నష్టం జరిగితే ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు.

సీజన్లవారీగా చెల్లింపులు

2017–18 ఖరీఫ్ సీజన్‌లో 1,39,966 హెక్టార్లలో పలు రకాల పంటలు సాగైతే 51,081 హెక్టార్లలో వరి సాగు జరిగింది. సాగు చేసిన రైతుల్లో 13,305 మంది ఫసల్ బీమా స్కీంలో రూ.2.26 కోట్లు చెల్లించారు. 2018-19 రబీలో42,497 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేయగా 39,131 హెక్టార్లలో వరిని సాగు చేశారు. పంటలు సాగు చేసిన రైతుల్లో 5,590 మంది ఫసల్ బీమా స్కీంలో రూ.1.65 కోట్లు చెల్లించారు. 2018-19 ఖరీఫ్‌లో 1,13,867 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేయగా వరి పంట 41, 050 హెక్టార్లలో పండించారు. 11,776 మంది రైతులు ఫసల్ బీమా స్కీంలో రూ.2.71 కోట్లు చెల్లించారు.

గత రబీ సీజన్లో 39,131 హెక్టార్లలో వరిని సాగు చేస్తే వడగండ్ల వర్షం కారణంగా 11 మండలాల్లో 4,212 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. ఆ వివరాలను బీమా కంపెనీ ఐసీఐసీఐకి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అందించిన లెక్క ప్రకారం వరి పంటకు ఎకరాకు రూ.34 వేల చొప్పున పరిహారం అందించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం రూ. 14 కోట్లు పరిహారం అందాలి. అయితే ఏడాది గడిచినా సంబంధిత బీమా కంపెనీ పరిహారం చెల్లించక పోవడమే గాక సంప్రదించినా ఎవరూ అందుబాటులోకి రావడట్లేదని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.

కంపెనీలు ప్రీమియం తీసుకునే టైంలో పెడుతున్న శ్రద్ధ.. బీమా చెల్లించడంలో చూపించడం లేదని రైతులు వాపోతున్నారు. మూడు సీజన్లలో రైతులు ప్రీమియం చెల్లించినా ఇంతవరకు ప్రయోజనం చేకూరలేదు. గత రబీలో 4,212 ఎకరాల్లో రైతులు వరి పంట నష్టపోతే ఇప్పటివరకు పరిహారం రాలేదు. సమాచారం కోసం ఫోన్ చేసినా స్పందించడం లేదని, ప్రతీ సీజన్‌కు బీమా కంపెనీలు మారడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని వ్యవసాయ శాఖ ఆఫీసర్ అనురాధ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed