బీజేపీ రామనామం.. ఆప్ అభివృద్ధి జపం

by Shamantha N |
బీజేపీ రామనామం.. ఆప్ అభివృద్ధి జపం
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎత్తులను ఆప్ పైఎత్తులు చిత్తు చేశాయి. హిందూ ఓట్ల సమీకరణ కోసం ఆ పార్టీ ‘షాహిన్‌బాగ్’ను లక్ష్యంగా చేసుకుంటే.. అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పారాయం చేశాడు. బీజేపీ ‘రామ మందిరం’ చరణం అందుకుంటే.. ఆప్ ‘అభివృద్ధి’ పల్లవి పాడింది. నామినేషన్ల పర్వం తర్వాత బీజేపీ టీ20 మ్యాచ్ మొదలెడితే.. ఆప్ 2017 నుంచే టెస్ట్ మ్యాచ్ ఆడింది. అంతిమంగా బీజేపీకి ఘోర ఓటమిని మిగిలిస్తే.. ఆప్‌కు అద్భుతమైన విజయాన్నందించాయి. బీజేపీ వ్యూహాలు.. ఆప్ ప్రతి వ్యూహాలను ఒక్కసారి పరిశీలిస్తే..
– 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అధికరణలు 370, 35(1) రద్దుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా, స్వయంప్రతిపత్తి తొలగించడం, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం వంటివి బీజేపీ నేతల్లో అతి నమ్మకాన్ని పెంచాయి. ఈ అంశాలు హిందువుల ఓట్ల సమీకరణకు దోహదపడి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు విజయాన్ని చేకూరుస్తాయని ఆ పార్టీ అధినేతలు భావించారు. కానీ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆప్ దృష్టి సారించడంతో బీజేపీ వ్యూహం విఫలమైంది.
– ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ‘హనుమాన్ చాలీసా’ అస్త్రాన్ని ప్రయోగించారు. పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. అదే ప్రధానంగా ప్రచారం చేశారు. దీన్ని గమనించిన ఆప్ నాయకులు ఎన్నికల సమయంలో షాహీన్‌బాగ్ ఆందోళనలకు దూరంగా ఉన్నారు. దీనివల్ల ముస్లింల పార్టీ అని ముద్ర పడకుండా జాగ్రత్త వ్యవహరించినట్లు అయింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పారాయణం వీడియోను ఆప్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ వీడియోల వల్ల బీజేపీ నమ్ముకున్న హిందూ ఓటర్లను కేజ్రీవాల్ ఎంతో కొంత తనవైపు తిప్పుకోగలిగారు.
– ఎన్నికల్లో బీజేపీ ‘వ్యతిరేక ప్రచారానికి’ పెద్దపీట వేయడం మధ్యతరగతి ప్రజలకు చికాకు కలిగించింది. ఇదే తరహాలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రచారం చేసి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అయినా, 2020లోనూ అదే విధానాన్ని అనుసరించింది.
– 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమి పాలైంది. అప్పుడే కళ్లు తెరిచిన ఆ పార్టీ నేతలు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పావులు కదిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. దీనికి భిన్నంగా బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల నామిషన్ల పర్వం ముగిసిన తర్వాత ప్రచారం ప్రారంభించారు. ఇదీ ఆ పార్టీకి ఎన్నికల్లో ఘోర ఓటమికి మరో కారణం.
– ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం బీజేపీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆప్ అధినేతపై వ్యక్తిగత దాడి ఏ స్థాయిలో పెరిగిందో.. ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కూడా అదే స్థాయిలో చేకూరింది.
– ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవడం కూడా బీజేపీకి నష్టాన్ని చేకూర్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆప్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే స్థాయి గల నేత బీజేపీలో లేరని ప్రచారం చేపట్టారు. ఈ వ్యూహం ఫలించింది. ఢిల్లీకి చెందిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు సౌమ్యుడిగా పేరుంది. ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే నష్టం తగ్గేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
– ఢిల్లీ రాష్ట్ర జనాభాలో 14 శాతం ముస్లింలు ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ముస్లింలు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో దూరమయ్యారు. ఇదీ ఆ పార్టీకి నష్టం చేకూర్చింది.

Next Story

Most Viewed