PM Narendra Modi: ప్రధాని మోడీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం

by Mahesh Kanagandla |
PM Narendra Modi: ప్రధాని మోడీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)కి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. నైజీరియా(Nigeria) దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్’(GCON Award) తో మోడీని సత్కరించారు. మోడీ తన మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం నైజీరియాలోనే ఉన్నారు.17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ రికార్డు సృష్టించనున్నారు. బ్రిటన్ మాజీ క్వీన్ ఎలిజబెత్‌కు 1969లో ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ అవార్డు స్వీకరించడం గర్వంగా ఉన్నదని, వినమ్రతతో స్వీకరిస్తున్నానని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రజలకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అవార్డు ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరో ఎత్తుకు తీసుకెళ్లుతాయని విశ్వసిస్తున్నట్టు తెలిపారు. నరేంద్ర మోడీ అందుకున్న 17వ అంతర్జాతీయ అవార్డు ఇది. నైజీరియా పర్యటన అనంతరం మోడీ బ్రెజిల్ వెళ్లనున్నారు. ఈ నెల14న డొమినికా దేశం మోడీకి అత్యున్నత పురస్కారమైన ‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’ని అందజేయనున్నట్టు ప్రకటించింది.

Advertisement

Next Story