జీహెచ్ఎంసీలో వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక యాప్

by Shyam |
GHMC social media
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైరిస్క్ పర్సన్స్ కు వాక్సిన్ వేసేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమయింది. మాన్యువల్ గా అర్హులను గుర్తించి, టోకెన్లు అందజేస్తుండటంతో వ్యాక్సిన్లు పక్కదారి పడుతున్నాయి. రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్లతో వ్యాక్సినేషన్ సెంటర్లలో పరిస్థితి గందరగోళంగా తయారవుతోంది. గ్రేటర్ లోని పలు కేంద్రాల్లో వ్యాక్సిన్లను సంబంధంలేని వ్యక్తులకు ఇచ్చారని విమర్శలు వస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై బల్దియా అధికారులు దృష్టి సారించారు. మంగళవారం నుంచి ప్రత్యేక యాప్ ద్వారా ఆన్ లైన్ టోకెన్లు ఇవ్వనున్నారు. జీహెచ్ఎంసీలో ముద్రించిన టోకెన్లను వ్యాక్సినేషన్ కు ఒక రోజు ముందుగా అందజేస్తున్నారు.

ప్రభుత్వం గుర్తించిన తొమ్మిది కేటగిరీల్లోని వ్యక్తులకు కాకుండా రాజకీయ నాయకులు, దుకాణదారులు తమ కుటుంబ సభ్యులకు, అనుచరులకు ఈ టోకెన్లను ఇస్తున్నారు. దీంతో అర్హులకు కాకుండా వ్యాక్సిన్లు పక్కదారి పడుతున్నాయి. తాము చెప్పిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వలేదంటూ కొన్ని సర్కిళ్లలో కార్పొరేటర్లకు, అధికారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో సంబంధం లేని వ్యక్తులకు వ్యాక్సిన్లు వేస్తున్నారంటూ హైరిస్క్ పర్సన్స్ నుంచి వ్యతిరేకత వస్తోంది. దీంతో తొమ్మిది కేటగిరీల్లోని వ్యక్తులకు మాత్రమే టీకాలు అందించేవిధంగా బల్దియా అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

పని ప్రదేశాల్లోనే రిజిస్ట్రేషన్లు

ఇప్పటివరకు పేపర్ టోకెన్లు ఇస్తుండటంతో అనేక సమస్యలు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బుధవారం నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టనున్నారు. ఇక నుంచి నేరుగా పని ప్రదేశాలకు వెళ్లిన బృందం అక్కడ హైరిస్క్ పర్సన్స్ ను ఫోటోలు తీస్తుంది. అర్హుల ఫోటోలు, ఆధార్ కార్డు నెంబర్‌‌తో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొబైల్ కి ఓటీపీ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ను వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద చెబితే అక్కడున్న సిబ్బంది నిర్థారణ చేసుకుని వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం బల్దియా పరిధిలోని ప్రతీ సర్కిల్ లో 20 లాగిన్స్ ఇచ్చిన అధికారులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టారు.

దుకాణాల్లో పనిచేసే వారి ఆధార్ కార్డులు మాత్రమే తీసుకుంటుండటం, ఓటీపీ కూడా ఉండటంతో ఇతరులకు వ్యాక్సిన్ పొందే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ బృందాలు వెళ్లే సమయానికి తమ కుటుంబ సభ్యులను, ఇతరులను పని చేస్తున్నట్టు ఏర్పాటు చేస్తే వారి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఐదు రోజులుగా వ్యాక్సినేషన్ కోసం రాజకీయ నాయకుల ఒత్తిళ్లను తగ్గించుకునేందుకు, అనర్హులకు వ్యాక్సిన్ అందిస్తున్నారన్న విమర్శలకు సమాధానంగా బల్దియా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story