పిల్లలకు పార్క్ అవసరమా..? జీహెచ్ఎంసీ స్థలం కబ్జా.. అంతటితో ఆగకుండా!

by Shyam |
పిల్లలకు పార్క్ అవసరమా..? జీహెచ్ఎంసీ స్థలం కబ్జా.. అంతటితో ఆగకుండా!
X

దిశ, శేరిలింగంపల్లి : రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో హైదరాబాద్ మహానగరం ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌లా మారిపోయింది. అటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. కానీ, అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఉన్న పార్కులను, ప్రభుత్వ స్థలాలను సైతం కబ్జాలు చేస్తూ సొసైటీల పేరుతో అందులోనే కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. పార్కుల్లో పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులను మూలన పడేసి అందులోనే నిర్మాణాలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ పార్కు స్థలంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనానికి ఏకంగా కార్పొరేటర్ చేత కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం ప్రభుత్వ స్థలాలపై వారికున్న చిత్తశుద్దికి నిదర్శనం.

నేనే మోనార్క్.. అంతా నా ఇష్టం..

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉంది. పలు డివిజన్లలో చెరువు శిఖాలు, సర్కార్ స్థలాలు ఇప్పటికే పెద్ద మొత్తంలో అన్యాక్రాంతం అయ్యాయి. ఇక ఇప్పుడు జీహెచ్ఎంసీ పార్క్ స్థలాలను చెరబడుతున్నారు కొన్ని సొసైటీల సభ్యులు. జీహెచ్ఎంసీ స్థలాల్లో ఏర్పాటు చేసిన పార్కులను సైతం నిర్వీర్యం చేసి సొసైటీల పేరుతో అందులో కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దత్తత డివిజన్ హైదర్ నగర్‌లోని ఆదిత్య నగర్‌లో ఉన్న సుమారు అరఎకరం ప్రభుత్వ స్థలంలో జీహెచ్ఎంసీ అధికారులు పిల్లల కోసం పార్కుగా అభివృద్ధి చేశారు. వారు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను సైతం ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలంపై మనసు పారేసుకున్న ఆ సొసైటీ అధ్యక్షుడు.. ఈ స్థలం మాదేనని అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని చెబుతున్నారే కానీ, వాటిని బయట పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఇక పిల్లలు ఆడుకునేందుకు స్థలం దేనికనుకున్నారో ఏమో.. ఆ స్థలంలో తన హయాంలో ఆదిత్య నగర్ సొసైటీ వారికోసం ఓ కమ్యూనిటీ భవనం నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఇందుకు గాను జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని చెరబట్టి అందులో కమ్యూనిటీ భవనం కట్టేస్తున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో పనులు వేగంగా జరిగిపోతున్నాయి.

ఎమ్మెల్యే, కార్పొరేటర్ పేరు దుర్వినియోగం చేస్తున్నారా..?

జీహెచ్ఎంసీ పార్క్ స్థలంలో సాగుతున్న ఈ నిర్మాణం స్థానిక ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అనుమతితోనే సాగుతుందని, అన్నీ వారే చూసుకుంటారని చెబుతున్నారు ఆదిత్య నగర్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి. ఇదే విషయం ఎమ్మెల్యే, కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్తే తమకు ఎలాంటి సమాచారం లేదని, జీహెచ్ఎంసీ పార్క్ స్థలంలో కమ్యూనిటీ భవనం ఎలా కడతారని, వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదేశించనున్నట్టు తెలిపారు. అయితే, ఆదిత్య నగర్ సొసైటీ అధ్యక్షుడు మాత్రం మాటకు ముందు, వెనక ఎమ్మెల్యే, కార్పోరేటర్ పేరును యథేచ్ఛగా వాడేస్తున్నారు. అంతేకాదు ఈ కమ్యూనిటీ భవనానికి ఏకంగా స్థానిక కార్పోరేటర్ నార్నే శ్రీనివాసరావు చేత శంకుస్థాపన చేయించడం గమనార్హం. అదే ఆసరాగా చేసుకున్న సొసైటీ అధ్యక్షుడు వారిని బూచిగా చూపుతూ విలువైన పార్క్ స్థలంలో సొసైటీ కోసం కమ్యూనిటీ భవనం కడుతున్నారు. ఇప్పటికే ఆదిత్య నగర్‌లో సొసైటీ భవనం ఉన్నా పార్క్ స్థలంలో మరో భవనం నిర్మించాలని సంకల్పించడం ఎందుకో ఆయనకే తెలియాలి.

మాకెందుకు పార్కులు..

జీహెచ్ఎంసీ పార్క్ స్థలం కబ్జాపై ఆదిత్య నగర్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించింది దిశ. దీనిపై స్పందించిన సదరు అధ్యక్షుడు హైదర్ నగర్‌లో ఇప్పటికే బోలెడన్ని పార్కులున్నాయి, ఇంకా మాకెందుకు పార్కులు. ఈ స్థలం సొసైటీ కోసమే కేటాయించారు. ఎమ్మెల్యే అనుమతించారు, కార్పొరేటర్ కొబ్బరికాయ కొట్టారు. అయినా మీకెందుకు చెప్పాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసోళ్లకే చుక్కలు చూపించిన నాకు మీడియా అంటే ఓ లెక్కనా అంటూ ఫోన్‌లోనే నోటికి వచ్చింది మాట్లాడారు ఆదిత్యనగర్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి. ఓ పక్కన ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములు కబ్జా అయితే ఎవడూ పట్టించుకోడు. కానీ మేం చేస్తే తప్పచ్చిందా అంటూ జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నామని చెప్పకనే చెప్పారు సొసైటీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి.

మా దృష్టికి రాలేదు. మేము ఎవరికీ కేటాయించలేదు..

హైదర్ నగర్ డివిజన్ ఆదిత్య నగర్ జీహెచ్ఎంసీ పార్కు స్థలంలో సొసైటీ భవన నిర్మాణం సాగుతున్నట్లు తమ దృష్టికి రాలేదు. పార్కు స్థలంలో కమ్యూనిటీ భవనాలు ఎలా కడతారు. అది చట్టరీత్యా నేరం. బాధితులపై చర్యలు తీసుకుంటాం.

-డీసీ రవికుమార్

Advertisement

Next Story