గతేడాది 45 శాతం వృద్ధి సాధించిన రియల్‌మీ!

by Harish |
గతేడాది 45 శాతం వృద్ధి సాధించిన రియల్‌మీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ సంస్థ భారత్‌లో తన ఉత్పత్తి 90 శాతానికి చేరుకుందని, ఇది దేశీయంగా తమ బ్రాండ్‌కు ఉన్న డిమాండ్‌ను తీర్చగలదని రియల్‌మీ సీఈఓ మాధవ్ సేథ్ తెలిపారు. ‘కంపెనీ ఉత్పత్తి కార్యాలయాల్లో దాదాపు సాధారణ స్థాయిల్లో కార్మికులు ఉన్నారని, అవసరమైన జాగ్రత్తలను పాటిస్తూ ఉత్పత్తి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని మాధవ్ సేథ్ పేర్కొన్నారు. 2020 క్యాలెండర్ ఏడాది రెండో భాగంలో రియల్‌మీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు.

‘వినియోగదారుల సెంటిమెంట్ కరోనాకు ముందు ఉన్న పరిస్థితుల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత వినియోగదారులు బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారు. రియల్‌మీ ఈ రకమైన ధోరణిని గమనిస్తోంది. కస్టమర్లకు తగిన స్థాయిలో ఉత్పత్తి వ్యూహాలను అనుసరించనున్నట్టు’ మాధవ్ సేథ్ వివరించారు. రియల్‌మీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా మారిందని, ఆన్‌లైన్‌లో అనువైన బ్రాండ్ కావడంతో కంపెనీ ఆన్‌లైన్ అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో 45 శాతం పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 60-80 లక్షల స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లీడర్‌గా మారాలని, వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని కంపెనీ తెలిపింది. 2021లో రియల్‌మీ కొత్త టెక్నాలజీ వినియోగదాన్ని పెంచనుందని వెల్లడించింది.

Advertisement

Next Story