మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ కీలక చర్చలు

by Shyam |   ( Updated:2021-07-13 03:46:46.0  )
మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ కీలక చర్చలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మరియు తెలంగాణ గురించి మంత్రి కే తారకరామారావు పలు వివరాలు అందించారు. హైదరాబాద్ నగరం కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మోపాలిటన్ స్వభావంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నదని, ఇక్కడ అనేక రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు, వారి సిబ్బంది దీర్ఘకాలంగా పని చేస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు, టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగామని ఈ సందర్భంగా కేటిఆర్ హై కమిషనర్‌కు వివరించారు. తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు పోటీ పడుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed