రవీందర్‌ సింగ్‌కు మేమున్నాం.. నీకు టీఆర్ఎస్‌లో నీకు శాశ్వత స్థానం ఉందా?

by Sridhar Babu |
Sikh community leaders
X

దిశ, కరీంనగర్ సిటీ: మాజీ మేయర్ రవీందర్ సింగ్‌పై అవాకులు-చవాకులు పేలితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని, ఆయనకు అండగా మేమంతా ఉన్నామంటూ నగరంలోని సిక్కు సామాజిక వర్గం నేతలు ప్రకటించారు. గురువారం ఆ సంఘం నాయకులు సర్దార్ రణధీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి గంగుల కమలాకర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు తమ సామాజికవర్గం నుంచి రాజకీయాల్లో రాణిస్తోన్న ఏకైక వ్యక్తి రవీందర్ సింగ్ అని, నగరంలో ఆయనకు వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక మంత్రి గంగుల అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా, మంత్రికి ఎందుకు కడుపు మంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

పోలింగ్‌కు ముందు క్యాంపులు పెట్టి కాంగ్రెస్, బీజేపీ ఓటర్లను గోవా, బెంగళూరు, తిరుపతి వంటి విహార యాత్రలకు తరలించింది మంత్రి గంగుల కమలాకరే అని రాష్ట్రమంతా తెలుసని అన్నారు. ఎలాంటి క్యాంపులు నిర్వహించకుండా ఆయనకున్న బలంతోనే రవీందర్ సింగ్ 232 ఓట్లు సాధించాడని అన్నారు. రవీందర్ సింగ్‌ని రాజీనామా చేయమనటం కాదని మంత్రి గంగులకు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇద్దరూ కలిసి తిరిగి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కోన్ కిస్కా గాళ్ల బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో నీకు శాశ్వత స్థానం ఉన్నదా? ముందు తేల్చుకోమని సూచించారు. ఈ సమావేశంలో సిక్కు నాయకులు ఎస్‌జే సింగ్, బల్బీర్ సింగ్, రాజన్ సింగ్, యువరాజ్ సింగ్‌తో పాటు యూత్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed