పోలీసుల కంట్రోల్‌లో సిద్దిపేట కలెక్టరేట్.. ఐడీ కార్డు ఉంటేనే అనుమతి

by Shyam |
పోలీసుల కంట్రోల్‌లో సిద్దిపేట కలెక్టరేట్.. ఐడీ కార్డు ఉంటేనే అనుమతి
X

దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేట సమీకృత కలెక్టర్ కార్యాలయం పోలీసుల దిగ్బంధనంలో ఉంది. అన్నదాతలపై కలెక్టర్ మాట్లాడిన మాటలు ఇంకా చల్లారలేదు. దీనిపై ప్రతిపక్ష నాయకులు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. గురువారం బీజేపీ.. కలెక్టరేట్ ముట్టడికి యత్నించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దయెత్తున పోలీసులు కలెక్టరేట్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా కలెక్టరేట్‌లో పనిచేసే సిబ్బంది కార్యాలయంలోనికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా సామాన్యులు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తే పోలీసులు లోపలికి పంపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యయ ప్రయాసలకు కష్టపడి కలెక్టరేట్ కార్యాలయానికి వస్తే తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎందుకు అనుమతించరంటూ సామాన్య ప్రజలు పోలీసుల తీరును ఖండిస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, సామాన్యులు..

కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది కార్యాలయంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టర్ తీరుకు నిరసనగా ప్రతిపక్ష నాయకులు ముట్టడికి యత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరిని అనుమానిస్తూ సిబ్బందిని ఐడీ కార్డులు చూపించండి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి రాగా వారిని తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. ఎందుకోసం వచ్చావంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది ఆరోపించారు. మొత్తానికి కలెక్టర్ కారణంగా కార్యాలయ సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం..

కలెక్టర్ మాట్లాడిన మాటలు తక్షణమే వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. అన్నదాతలపై తప్పుగా మాట్లాడిన కలెక్టరుకు పోలీసులు వత్తాసు పలకడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ తన తీరు మార్చుకోవాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed