టీఆర్ఎస్‌కు షాక్.. ఒకేసారి రెండు దెబ్బలు!

by Anukaran |   ( Updated:2021-11-26 10:18:50.0  )
టీఆర్ఎస్‌కు షాక్.. ఒకేసారి రెండు దెబ్బలు!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల రోజురోజూకీ వ్యతిరేకత పెరుగుతోంది. ఇటు ప్రజల్లోనే కాదు.. అటు ప్రజాప్రతినిధుల్లోనూ అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా మారింది. అయితే ఆ అసంతృప్తిని నిరసన రూపంలోనో.. ధర్నా రూపంలోనో చూపితే ఫర్వాలేదనుకోవొచ్చు. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీకి చెందిన ఓ ఎంపీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదంటూ ఏకంగా ఆ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే ఆ ఎంపీపీ బీజేపీకి చెందినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా చేయడంతో మిగతా ఓటర్లకు ఏం సంకేతాలు వెళతాయనే ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది.

మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని టీఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నించినా.. చివరి నిమిషంలో అవికాస్త బెడిసికొట్టాయి. వాస్తవానికి టీఆర్ఎస్ మినహా ప్రధాన పార్టీలు పోటీలో లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీని ఏకగ్రీవం చేయడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమయ్యిందనే చెప్పాలి. ఇదే సమయంలో ఓవైపు టీఆర్ఎస్ కీలక ప్రజాప్రతినిధి ఒకరు ఎమ్మెల్సీ ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తుంటే.. అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ఓటర్లే పోటీలో ఉండాలంటూ స్వతంత్ర అభ్యర్థులను బతిమాలుతుండడం చర్చనీయాంశంగా మారింది.

ఆరుగురూ ఏకగ్రీవానికి ఓకే చెప్పినా..?

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, అందులో రెండు రోజుల ముందుగానే ముగ్గురు నామినేషన్ విత్ డ్రా చేసుకోగా, మరొకరి నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గురువారం సాయంత్రం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు టీఆర్ఎస్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఓవైపు ఇతర జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కావడం, నల్లగొండ జిల్లాలో ప్రధాన పార్టీలు పోటీ చేయనప్పటికీ ఆ దిశగా పరిస్థితులు కన్పించకపోవడం జిల్లా టీఆర్ఎస్ నేతలకు కొంత ఇబ్బందిగానే మారింది. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేత ఒకరు నల్లగొండ జిల్లా కేంద్రంలోనే మకాం పెట్టారు. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం వరకు మాత్రమే గడువు ఉండడంతో ఏకగ్రీవ ప్రయత్నాలు స్పీడప్ చేశారు. అందులో భాగాంగానే ఆ కీలక నేత ఆఫర్లకు ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గురువారం రాత్రే ఓకే చెప్పేశారు. దాదాపుగా కోటికి పైగానే ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.

చివరి నిమిషంలో షాకిచ్చిన అభ్యర్థులు

ఈ విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగడంతో కథంతా మారిపోయింది. శుక్రవారం ఉదయం నుంచే కోమటిరెడ్డి తన వ్యుహాలకు పదునుపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికకు పోటీ జరిగేలా చేయడంలో సఫలీకృతులయ్యారనే చెప్పాలి. శుక్రవారం మధ్యాహ్నాం సమయంలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ ఫామ్‌ను నింపి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మరో అభ్యర్థి తరపు నుంచి ఏజంట్ ఫామ్ నింపి రెడీగా ఉన్నా.. అసలు ఆ అభ్యర్థి పత్తా లేకుండా పోయారు. మరో పది నిమిషాల్లో ఏకగ్రీవం ఎన్నిక లాంఛనమే అని భావించినా.. కోమటిరెడ్డి ప్రయత్నాలకు ఓ అభ్యర్థి వెనక్కి తగ్గి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే శుక్రవారం రాత్రి వరకు ఆయన ఎవ్వరికీ అందుబాటులో రాలేదు. దీంతో మిగతా స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉంటామని కలెక్టరేట్ నుంచి వెనక్కి తిరిగివచ్చారు. కాసేపట్లో ఏకగ్రీవం అవుతుందనుకున్న ఎమ్మెల్సీ కాస్త.. పోటీ జరుగుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులకు షాక్ తగిలినట్టయ్యింది.

రాజీనామాతో మరో షాకిచ్చిన ఎంపీపీ..

ఓవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కొలహాలం సాగుతుంటే.. మరోవైపు యాదాద్రి జిల్లాకు చెందిన ఓ బీజేపీ ఎంపీపీ తన పదవికి రాజీనామా చేయడం పెను సంచలనం సృష్టించినట్టయ్యింది. అసలే ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయలేకపోయామనే అసంతృప్తిలో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులను బీజేపీ ఎంపీపీ రాజీనామా వార్త ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక అసలు విషయానికొస్తే.. యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండల ఎంపీపీ సంధ్యారాణి.. తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తన ఎంపీపీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. రెండున్నరేండ్ల పదవీ కాలంలో ఎలాంటి నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాల వల్లే ఉన్నామని చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు ఎంపీపీ సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ మేరకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓకు తన రాజీనామాను సమర్పించారు.

సర్దార్‌కు జై.. టీఆర్ఎస్‌కు నై.. అక్కడిదే గులాబీ నేతల నినాదం!

Advertisement

Next Story

Most Viewed