షర్మిలకు ‘ఈటల’ ఎఫెక్ట్.. అంచనాలన్నీ తారుమారు

by Anukaran |
షర్మిలకు ‘ఈటల’ ఎఫెక్ట్.. అంచనాలన్నీ తారుమారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎఫెక్ట్ పడనుంది. ఆయన బర్తరఫ్‌తో సీన్ రివర్స్ అయింది. త్వరలోనే ఈటల పార్టీ పెడతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో షర్మిల టీంలో ఆందోళన నెలకొంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఢీకొట్టే పార్టీ లేకపోవడంతో పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్న షర్మిల అంచనాలన్నీ తారుమారయ్యాయి. జూలైలో పార్టీ జెండా, ఎజెండా ప్రకటించాల్సిన తరుణంలో ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. ఇతర పార్టీల్లో గుర్తింపు, ఆదరణ కరువైన నేతలంతా తనగూటికి చేరుతారనుకుంటే దానికి ఈటల బ్రేక్ వేసినట్లయింది.

వరుస భేటీలతో షర్మిల టీంలో టెన్షన్.. టెన్షన్

బర్తరఫ్ అయిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పలు పార్టీల ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొండా సురేఖ దంపతులు, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, డీ శ్రీనివాస్, బీజేపీ ఎంపీ అర్వింద్‌తో ఇప్పటికే సమావేశమయ్యారు. ఈ భేటీల ముఖ్య ఉద్దేశ్యం నూతన పార్టీ ఏర్పాటుకేనని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని షర్మిల ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

స్వయంగా వైఎస్సార్ తనయ కావడం వల్ల జనం కూడా ఆదరించారు. పార్టీ ఏర్పాటు చేస్తే గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా జనం వెన్నంటే ఉన్నారన్న భావన షర్మిలలో కనిపించింది. ఒక సందర్భంలో వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అని కూడా చెప్పి తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అయితే ఈటల బర్తరఫ్, ఇతర పార్టీల నేతలతో వరుస భేటీలు షర్మిలను కొంత టెన్షన్‌లో పడేశాయి.

అంచనాలు తారుమారు..

తెలంగాణలో పాలకుల వైఫల్యాలను ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడం, ప్రజలను ప్రభావితం చేసేంత స్థాయికి కాంగ్రెస్, బీజేపీలు చేరుకోకపోవడంతో ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయి. దీంతో పార్టీ ఏర్పాటు చేస్తే తమకు పూర్తి మద్దుతు ఉంటుందని షర్మిల భావించింది. అంతేకాకుండా తన తండ్రి వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధిపొందిన ప్రజలు, ఆయన అభిమానులు, కాంగ్రెస్‌లోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు, మైనార్టీ నేతలు, ఇతర పార్టీల్లో ఆదరణ దక్కని నాయకులంతా తనవెంటే నడుస్తారని షర్మిల భావించింది. అందుకే తెలంగాణలో రెండో పార్టీ అవసరాన్ని గ్రహించి పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలో మారిన రాజకీయాలతో ఈటల రాజేందర్ రూపంలో షర్మిల పార్టీకి సెగ తగిలే అవకాశాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె అంచనాలన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి.

ఉద్యమ నేత కావడంతో మరింత గుబులు..

ఈటల రాజేందర్ ఉద్యమ నాయకుడు కావడం షర్మిలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పచ్చి తెలంగాణ వాది, సీనియర్ నేత, రాష్ట్రంపై పూర్తి పట్టు, అవగాహన ఉన్న నాయకుడు కావడంతో షర్మిల టీమ్‌కు గుబులు పట్టుకుంది. ఈటల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే బీసీలు, టీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉన్న నేతలతో పాటు జనం కూడా ఎక్కువ శాతం ఈటల వైపునకు మళ్లే అవకాశం ఉందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ ఏర్పాటుతో అనుకున్నంత ఆదరణ వస్తుందా లేదా అనే సందిగ్ధంలో షర్మిల టీం పడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed