భారీ లాభాలు సాధించిన సూచీలు!

by Harish |   ( Updated:2021-05-17 06:08:42.0  )
భారీ లాభాలు సాధించిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఆసియా మార్కెట్ల మద్దతుతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. ఉదయం ప్రారంభం నుంచే లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్లు చైనా పారిశ్రామికోత్పత్తి పెరిగిన వార్తలతో ఆసియా మార్కెట్లు, దేశీయంగా కరోనా కేసులు తగ్గుతున్న సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా డీఆర్‌డీఓ 2డీజీ పేరుతో కరోనా ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేయడం, స్పుత్నిక్-వి టీకాలు భారత్‌కు చేరుకోవడం, కరోనా కొత్త వేరియంట్‌పై కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తాయనే పరిణామాల మధ్య మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారని విశ్లేషకులు తెలిపారు.

ప్రధానంగా ఇటీవల డీలాపడుతూ వచ్చిన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడిదారులు కొనుగోళ్లు జరపడంతో స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 848.18 పాయింట్లు ఎగసి 49,580 వద్ద ముగియగా, నిఫ్టీ 245.35 పాయింట్లు పుంజుకుని 14,923 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం 3 శాతం లాభాలు సాధించగా, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాల కౌంటర్లు బలపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాను చూడగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను దక్కించుకున్నాయి. ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.29 వద్ద ఉంది.

Advertisement

Next Story