బ్యాంకింగ్ మద్ధతుతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

by Harish |   ( Updated:2021-07-13 05:38:24.0  )
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. మంగళవారం ఉదయం నుంచే సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్లు చివరివరకు అదే ధోరణిని కొనసాగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా కరోనా టీకా పురోగతి నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయని నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల స్టాక్స్ కోసం మదుపర్లు కొనుగోళ్ల జోరును పెంచారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 397.04 పాయింట్లు ఎగసి 52,769 వద్ద ముగియగా, నిఫ్టీ 119.75 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ 1 శాతం పుంజుకోగా, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా రంగాలు బలపడ్డాయి. ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండగా, మీడియా, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం షేర్లు లాభాలను సాధించగా, హెచ్‌సీఎల్ టెక్, డా రెడ్డీస్, మారుతీ సుజుకి, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.46 వద్ద ముగిసింది.

Advertisement

Next Story