భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

by Harish |
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజూ అధిక లాభాలను సాధించాయి. కీలక రంగాల్లో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాలను కొనసాగించాయని, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడం మార్కెట్లకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించడం, తద్వారా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటంతో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుందని నిపుణులు తెలిపారు.

అదేవిధంగా ఆసియా మార్కెట్లు ఉదయం ప్రారంభమైన సమయంలో జోరుగా ర్యాలీ చేసినప్పటికీ మిడ్-సెషన్ అనంతరం మిశ్రమంగా ట్రేడింగ్ ముగించాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలతో దేశీయ మార్కెట్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, టెక్ రంగాల ప్రభావంతో అధిక లాభాలు నమోదయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 584.41 పాయింట్లు ఎగసి 51,025 వద్ద ముగియగా, నిఫ్టీ 142.20 పాయింట్లు లాభపడి 15,098 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ రంగాలు పుంజుకోగా, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్ షేర్లు లాభపడగా, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.94 వద్ద ఉంది.

Advertisement

Next Story