డీలాపడ్డ స్టాక్ మార్కెట్లు!

by Harish |
డీలాపడ్డ స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. వరుస మూడురోజుల లాభాలకు అంతర్జాతీయ పరిణామాలు దెబ్బకొట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికమవడం, దీనికి అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో సూచీలు డీలాపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేని వేళ, అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి సూచీలు ర్యాలీ అవుతాయని, ఈ కారణంగానే వరుస లాభాల తర్వాత గురువారం మార్కెట్లు నష్టపోయాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 598.57 పాయింట్లు కోల్పోయి 50,846 వద్ద ముగిసింది. నిఫ్టీ 164.85 పాయింట్లు నష్టపోయి 15,080 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ రంగం 2 శాతానికిపైగా డీలాపడింది. ప్రైవేట్ రంగ బ్యాంక్ నీరసించింది. ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఆల్ట్రాటెక్ సిమెంట్, డా రెడ్డీస్, ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభపడగా, మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.75 వద్ద ఉంది.

Advertisement

Next Story