ఒకరోజు విరామం తర్వాత మళ్లీ నష్టాల్లో సూచీలు!

by Harish |   ( Updated:2021-11-24 06:36:17.0  )
ఒకరోజు విరామం తర్వాత మళ్లీ నష్టాల్లో సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒకరోజు విరామం తర్వాత మరోసారి కుదేలయ్యాయి. బుధవారం ట్రేడింగ్‌లో లాభాలతో మొదలైన సూచీలు మిడ్-సెషన్ తర్వాత నష్టాల్లోకి జారాయి. కేంద్ర కేబినెట్ సమావేశంలో క్రిప్టోకరెన్సీపై ఎలాంటి చర్చ జరగలేదనే ఊహాగానాల నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగిందని, దీనికితోడు జర్మనీలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ వల్ల అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇంట్రాడే గరిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధపడటం.. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్ కంపెనీలు షేర్లు స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని, చివరి గంటలో అమ్మకాలు అధిక నష్టాలకు దారితీశాయని నిపుణులు తెలిపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 323.34 పాయింట్లు పతనమై 58,340 వద్ద, నిఫ్టీ 88.30 పాయింట్లు కోల్పోయి 17,415 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అధికంగా 1.5 శాతం మేర క్షీణించగా, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు నిరసించాయి. బ్యాంకింగ్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, ఐటీసీ, రిలయన్స్, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.38 వద్ద ఉంది.

Advertisement

Next Story