నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Harish |
Sensex Brek
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం ప్రారంభం నుంచే నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. మిడ్-సెషన్ సమయంలో కీలక రంగాల నుంచి కొనుగోళ్ల మద్దతు కారణంగా లాభాలవైపు పయనించిన తర్వాత తిరిగి అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా రిలయన్స్, ఐసీఐసీఐ బ్యనక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్ లాంటి దిగ్గజ సంస్థ షేర్లు పతనమవడంతో మార్కెట్లకు కలిసి రాలేదు. గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల వద్ద కొనసాగుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడుతున్నారు.

రిలయన్స్ లాంటి దిగ్గజ సంస్థ షేర్లు 2 శాతానికి పైగా కుదేలవడంతో మార్కెట్లు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్నాయి. జియో ఫోన్ విడుదల వాయిదా పడటం వల్లనే రిలయన్స్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నట్టు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 127.31 పాయింట్లను కోల్పోయి 58,177 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 13.95 పాయింట్లు నష్టపోయి 17,355 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ 1 శాతానికి పైగా పుంజుకుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ చైనా నుంచి కొన్ని అల్యూమినియం ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని సిఫార్సు చేసిన తర్వాత మెటల్ షేర్లు కొనుగోళ్లు భారీగా జరిగాయి.

ఇక, ఐటీ, రియల్టీ, హెల్త్‌కేర్, మీడియా, ఫార్మా రంగాలు బలపడ్డాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, మారుతీ సుజుకి, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.78 వద్ద ఉంది.

Advertisement

Next Story