కేటీఆర్ దమ్ముంటే కార్మికుల వద్దకు వచ్చి మాట్లాడు : బి.మధు

by Sridhar Babu |
కేటీఆర్ దమ్ముంటే కార్మికుల వద్దకు వచ్చి మాట్లాడు : బి.మధు
X

దిశ, గోదావరిఖని : రాష్ట్రంలో కార్మికుల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని సీఐటీయూకు పనిలేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అబద్ధాలను చెప్పారని Scks రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు అన్నారు. కేటీఆర్‌కు నిజంగా మాట మీద నిలబడే దుమ్ము, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తున్న రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వద్దకు వచ్చి మాట్లాడాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం, సీఐటీయూ నాయకులు సవాల్ విసిరారు. సింగరేణిలో కొన్నేండ్లుగా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగక, చాలీచాలని వేతనాలతో దయనీయమైన జీవితాలను గడుపుతున్నారన్నారు. తెలంగాణ వచ్చి ఏడేండ్లు గడిచినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ స్వయంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రామగుండం సభలో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు తక్కువగా ఉన్నాయని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హామీ ఇచ్చి మూడేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వేతనాలు పెంచడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కాలంలో హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. సింగరేణి లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఉందని ముఖ్యమంత్రి, ఎమ్మెస్సీ కవిత టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమక్షంలో గత 7ఏడేండ్లుగా ప్రకటించిన లాభాల బోనస్‌ను కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేటీఆర్ మా సవాల్‌ను స్వీకరించి సింగరేణికి రావాలని లేదా తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (SCKS)- CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, రాష్ట్ర కోశాధికారి వేల్పుల కుమారస్వామి హెచ్చరించారు.

Advertisement

Next Story