అనంతగిరి కొండల్లో అరుదైన మొక్క.. కనుగొన్న సైంటిస్టులు

by Shyam |   ( Updated:2021-07-17 08:25:49.0  )
new plant
X

దిశ, జడ్చర్ల: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వక్షశాస్త్ర సైంటిస్టులు కొత్త మొక్కను కనుగొన్నారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర సైంటిస్టులు విజయ్ భాస్కర్ రెడ్డి, రామకృష్ణరావు, బి. సదాశివయ్య, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి పరిశోధకులు డా. ప్రసాద్‌లు కొండల్లో తిరుగుతూ ఈ మొక్కను కనుగొన్నారు. అపోసైనేసి కుటుంబానికి చెందిన బ్రాకిస్టెల్మా ప్రజాతికి చెందిన ఒక మొక్కను మూడేండ్ల క్రితం కనుగొన్నారు. ఈ మూడేండ్లలో ఆ మొక్కను క్షణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకూ గుర్తించిన ఆ ప్రజాతికి చెందిన మొక్కల్లో దేనికి ఈ మొక్కతో పోలికలు లేకపోవడంతో ఈ మొక్కను కొత్తదిగా గుర్తించి ‘‘బ్రాకిస్టెల్మా అనంతగిరియెన్సె’’ అని నామకరణం చేశారు.

Botanical-Scientists

ఈ మొక్క అనంతగిరి కొండల్లోని గడ్డి మైదానాల్లో మాత్రమే మరీ ముఖ్యంగా నిమ్మగడ్డి పెరిగే ప్రదేశాల్లో మాత్రమే చిన్న చిన్న రాళ్ళ మధ్య పెరుగుతుంది. ఇది ఇప్పటికి కేవలం 3 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే కనుగొనబడింది. చుట్టపక్కల కొండల్లో ఎంత వెతికినా.. దాని జాడ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిలో బంగాళదుంప ఆకారంలో దుంపను కలిగిన ఈ మొక్క తొలకరి చినుకులకే మొలకెత్తి ఆకులు లేకుండా పుష్పిస్తుంది. అనతికాలంలోనే ఫలాలను ఏర్పరచి, విత్తనాలను వెదజల్లి ఆ తరువాత ఆకులను చిగురిస్తుంది. ముదురు గోధుమ రంగులో సుమారు 2.5 సెంటీమీటర్లు పూచే ఈ పూలు, మెలికలు తిరిగి ఆకర్షణీయంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రజాతికి చెందిన మొక్కల దుంపలను అనేక ప్రదేశాల్లో తినడమే కాకుండా సుఖవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారని డా. విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు.

పశువులను మేపడం, పర్యాటకులను అనుమతించడం, అడవికి నిప్పు పెట్టడం లాంటి చర్యల వల్ల ఈ అరుదైన జాతి నష్టపోయే ప్రమాదం ఉందని పరిశోధక విద్యార్థి పరమేష్ తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రజాతికి చెందిన 38 మొక్కలను భారతదేశంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారని ఇది 39వది అని జడ్చర్ల కళాశాల వృక్షశాస్త్ర సహయాచార్యులు డా. బి.సదాశివయ్య తెలిపారు. అతి తక్కువ మొత్తంలో (కేవలం 100) మొక్కలు ఉన్నందున ఇది అంతరించిపోయే మొక్కగా గుర్తించామని డా. ప్రసాద్ వివరించారు. అరుదైన మొక్కను కనుగొన్న బృందంలో జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సదాశివయ్య కూడా ఉండడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఆపియ్య చిన్నమ్మా డాక్టర్ సదాశివయ్యను అభినందించారు.

Advertisement

Next Story