ప్రశాంతతకు కేరాఫ్..హరమిచి పెయింటింగ్!

by vinod kumar |
ప్రశాంతతకు కేరాఫ్..హరమిచి పెయింటింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: భూమ్మీద ప్రతి మనిషికి కావాల్సింది ప్రశాంతత..ఏ పని చేసినా అందులో ప్రశాంతత లేకుంటే జీవితం వ్యర్థం అనిపిస్తుంటుంది. కానీ, నేటి కాలంలో ప్రశాంతతనిచ్చే పని దొరకడం చాలా అరుదు. అందుకే కొద్దిగా మానసిక ప్రశాంతత కోసం, అందరూ ఇంటర్నెట్‌ వైపు చూస్తున్నారు. అయితే ఇంటర్నెట్‌ కూడా ఈరోజుల్లో గందరగోళంగా తయారైందనుకోండి. కానీ, ఇక్కడ ప్రశాంతతనిచ్చే వీడియోలు కొన్ని ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఓ విధమైన సంతృప్తి కలుగుతుంటుంది. పెయింటింగ్ వీడియోలు అలాంటి వీడియోల కేటగిరీకే చెందుతాయి. తెల్లని కాగితం మీద వివిధ రంగులతో పెయింటింగ్ వేస్తుంటే అలా కళ్లార్పకుండా చూడాలనిపిస్తుంటుంది. కానీ, పెయింటింగ్ యూట్యూబ్ చానళ్లు చాలా తక్కువ ఉంటాయి. అందుకే అలాంటి అరుదైన యూట్యూబ్ చానల్ పెట్టి జపాన్‌కు చెందిన 73 ఏళ్ల హరమిచి షిబాసకి ఇప్పుడు పాపులర్ అవుతున్నారు.

వాటర్‌కలర్ బై షిబాసకి పేరుతో ఉన్న ఈయన చానల్‌కు 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నాయి. చెట్టు బొమ్మ పెయింటింగ్ నేర్పించే వీడియోకు 50 లక్షల మంది చూసేశారు. గతంలో ఆర్టిస్ట్‌గా, టీచర్‌గా పనిచేసిన హరమిచి వాటర్ కలర్‌లతో పెయింటింగ్ నేర్పించడానికి 2016లో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. మొదట్లో కేవలం పెయింటింగ్ మీద ఆసక్తి ఉన్నవారు మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకునేవారు. తర్వాత ఆయన వీడియోలకు కొన్ని ఆసక్తికర కామెంట్లు వచ్చేవని, వాటిని చదివిన తర్వాత తాను పెయింటింగ్ నేర్పించడంతోపాటు కొత్త విధానాన్ని అమలు చేసినట్లు హరమిచి తెలిపాడు. పెయింటింగ్ వేస్తుంటే చాలా రిలాక్సేషన్‌గా, ప్రశాంతంగా ఉంటుందని కొందరు చేసిన కామెంట్‌లతో తన వీడియోలు పెయింటింగ్ నేర్పించడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తున్నట్లు హరమిచి తెలుసుకున్నాడు. తర్వాత తన సబ్‌స్క్రైబర్‌లు కొద్దికొద్దిగా పెరిగారు. ఇక కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో పెద్ద మొత్తంలో సబ్‌స్క్రైబర్‌లు పెరిగినట్లు హరమిచి చెప్పారు. ఇలా తన వీడియోలు మానసిక ప్రశాంతతను ఇవ్వడం సంతోషంగా ఉందని హరమిచి అంటున్నారు.

Advertisement

Next Story