హద్దులు దాటిన సేవ.. అటవీ గ్రామాలే ఆలంబన

by Sridhar Babu |
హద్దులు దాటిన సేవ.. అటవీ గ్రామాలే ఆలంబన
X

దిశ, కాటారం : శ్రమజీవుల కుటుంబాల బిడ్డలే వారంతా. అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ యువకులు పదిమందికి బాసటగా నిలుస్తున్నారు. రవాణా సౌకర్యాలు ఉన్న ప్రాంతాలను ఆధుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు కానీ పల్లెలను పట్టించుకునేదెవరూ అన్న ఆలోచన ఆ యువతను సేవామార్గం వైపు నడిపించింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పాత తాలుకా పరిధిలోని ఐదు మండలాల్లో సేవలందిస్తోంది సంజీవినీ సేవా సమితి. ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం కేంద్రంగా ఈ సమితి సభ్యులు చేస్తున్న సేవలు ఆధర్శప్రాయంగా నిలుస్తున్నాయి.

కొవిడ్ బాధితులకు..

మహదేవపూర్, పల్మెల, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి నిత్యవసరాలు అందిస్తున్నారు ఎస్ఎస్ఎస్ సభ్యులు. ఇప్పటి వరకు వంద మంది కరోనా బాధితులకు నిత్యవసరాలను అందించారు. బృందాలుగా విడిపోయిన సమితి సభ్యులు ఇంటింటికి తిరిగి నిత్యవసరాలను సరఫరా చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కోవిడ్ బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పట్టించుకునే వారే లేరు. దీంతో కరోనా బాధితులకు ఆహారం అందడం లేదన్న విషయాన్ని గమనించిన ఎస్ఎస్ఎస్ సభ్యులు నిత్యవసరాలు అందించేందుకు ముందుకు వచ్చారు. కరోనా సోకిన వారిని భయంతో దూరంగా పెడ్తుండడం పల్లెల్లో మరీ ఎక్కువగా ఉంది. భయంతో వారి బాగోగులు పట్టించుకునే వారే లేకపోవడం ఎస్ఎస్ఎస్ సభ్యులను కలిచివేసింది. దీంతో వారే స్వయంగా నిత్యవసరాలను అందించే పనికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా కరోనా మృతదేహాలకు ఖననం చేసేందుకు కూడా వీరు సాహసించారు. పీపీఈ కిట్లు వేసుకుని కరోనా బారిన పడి చనిపోయిన అంత్యక్రియలు కూడ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వైద్య సేవలు..

రహదారులు లేని పల్లెల్లో వైద్య సేవలు కూడా అంతంత మాత్రమే. దీంతో మారుమూల గ్రామాల్లో వైద్య సేవలందించాలన్న తపనతో ఎస్ఎస్ఎస్ ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయించింది. కాకులు దూరని కారడవిలో ఏర్పడ్డ మహాముత్తారం మండలం మద్దికుంట గ్రామానికి కూడా ఎస్ఎస్ఎస్ సభ్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అడవి బిడ్డలకు వైద్యం అందించేందుకు ఆ ప్రాంతంలోని వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగంతో కలిసి సేవలందించేందుకు నడుం బిగించారు.

మానసిక వికలాంగులపై..

ఎస్ఎస్ఎస్ సభ్యుల సేవలు కేవలం సరిహధ్దుల్లోని తెలంగాణ పల్లెలకే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోనూ సర్వీస్ అందిస్తున్నారు. మానసిక వికలాంగులు ఎక్కువగా ఉన్న సిరొంచ కేంద్రంపై దృష్టి సారించిన ఈ సమితి సభ్యులు నలుగురికి కటింగ్ చేయించి అనాథ ఆశ్రమానికి తరలించారు. మరింత మందిని కూడా తరలించే ప్రయత్నాల్లో సంజీవీని సేవా సమితి నిమగ్నమైంది.

Advertisement

Next Story