టీఎస్​పీఎస్సీ యాక్టింగ్​ చైర్మన్‌గా సాయిలు

by Anukaran |   ( Updated:2021-03-31 04:06:27.0  )
TSPSC Sailu
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ యాక్టింగ్ చైర్మన్​గా సాయిలును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాయిలు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం టీఎస్​పీఎస్సీలో సాయిలు ఒక్కరే సభ్యులుగా ఉన్నారు. ఆయనే చైర్మన్ కావడంతో ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో ఆల్ ఇన్ వన్ కానున్నారు. సాయిలు పదవీ కాలం కూడా అక్టోబర్​లో ముగియనుంది.

డిసెంబరు నుంచి కేవలం ఇద్దరితో మాత్రమే కొనసాగుతున్న సర్వీస్ కమిషన్​లో యాక్టింగ్ చైర్మన్​గా వ్యవహరించిన క్రిష్ణారెడ్డి ఈ నెల 18న రిటైర్ అయ్యారు. దీంతో ఒక్క సభ్యుడే మిగిలారు. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కమిషన్​కు సభ్యులు లేకపోవడంతో పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం కమిషన్‌లో ఉన్న చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ముగ్గురు సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీల పదవీకాలం గత డిసెంబరులో ముగిసింది.

టీఎస్‌పీఎస్సీ యాక్ట్ ప్రకారం చైర్మన్‌తో పాటు గరిష్ఠంగా 10 మంది దాకా సభ్యులు ఉండాలి. అయితే సభ్యుల పదవీకాలం ముగియడంతో… ఇటీవలే ఒక చైర్మన్​తో పాటుగా ముగ్గురు సభ్యులను కొత్తగా నియమించేందుకు నిర్ణయం జరిగినట్లు సమాచారం. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్​రెడ్డి, మరో సభ్యుడిగా సీఎస్ సోమేశ్ కుమార్​కు సన్నిహితుడుగా ఉండే లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ డైరెక్టర్​గా పని చేసి గత నెలలో రిటైర్ అయ్యారు. సీఎస్‌కు లక్ష్మీనారాయణ సన్నిహితులు. జీఎస్టీ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో జరిగే కౌన్సిల్ సమావేశాలకు దీర్ఘకాలం వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించేందుకు సీఎస్ చొరవ తీసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా మరో సభ్యుడుగా సీఎంఓలో కీలకంగా ఉండే మరో అధికారి బంధువుకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ ముగ్గురు సభ్యులతో పాటుగా రిటైర్డ్​ ఐపీఎస్​ను చైర్మన్​గా నియమించేందుకు ఫైల్​ను సిద్ధం చేసినా… ఎన్నికల కోడ్​ నేపథ్యంలో గవర్నర్​ ఆమోదం వేసేందుకు వెనకాడినట్లు టాక్. వాస్తవంగా ఫిబ్రవరిలోనే సభ్యుల నియామకం చేసేందుకు ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఫైల్​ను పక్కన పెట్టిందంటున్నారు. తాజాగా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ నియామకాలను పూర్తి చేయాలనుకున్నప్పటికీ… గవర్నర్​ బ్రేక్​ వేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల భర్తీపై ఫైల్​ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో టీఎస్​పీఎస్సీకి పాలకవర్గం లేకపోవడం కొంత ఇబ్బందికరమే. అయితే పరిస్థితులెలా ఉన్నా తాత్కాలిక చైర్మన్​గా సాయిలును నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన్ను యాక్టింగ్​ చైర్మన్​గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీఎస్​పీఎస్సీలో ఇక ఒకే రాజు… ఒకే మంత్రి… ఒకే సైన్యంగా మారనుంది. అన్నింటికీ ఆయనే వ్యవహరించనున్నారు.

Advertisement

Next Story