సద్దాం, గడాఫీలూ ఇలానే చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |
Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: సందర్భం వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీ తీరుపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ప్రధానిని నిరంకుశ పాలకులైన సద్దాం హుస్సేన్, గడాఫీలతో పోల్చుతూ.. వాళ్లు కూడా ఎన్నికల్లో గెలవాలనే అనుకున్నారని, కానీ చివరికి ఏమైందో ప్రపంచానికంతటికీ తెలుసని అన్నారు. బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశుతోష్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్, లిబియా పాలకుడు గడాఫీ కూడా ఎన్నికలు కావాలనుకున్నారు. వారు గెలిచారు కూడా. దానర్థం వారికి ఓటింగ్ అంటే ఇష్టమని కాదు. ఆ ఓటును రక్షించే వ్యవస్థలన్నింటినీ నాశనం చేయాలని వారు అనుకున్నారు. ఎన్నికలు అనేవి ప్రజలు వెళ్లి తమకు నచ్చిన పార్టీ గుర్తు మీద బటన్ నొక్కేది కాదు. ఎన్నికలు అనేవి దేశంలో వ్యవస్థలన్నీ క్రమమైన పద్దతిలో పనిచేయడం గురించి జరిపేవి. న్యాయవ్యవస్థ న్యాయంగా పనిచేయడం కోసం. ప్రజల సమస్యలపై పార్లమెంటులో చర్చ జరపడం కోసం..’ అని అన్నారు.

రాహుల్ గాంధీ ఇటీవలే భారతదేశం ఇక ఎంతమాత్రమూ ప్రజాస్వామ్య దేశం కాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్య హక్కులు క్షీణించాయని, దేశంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే మళ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story