కేసీఆర్ నయా ప్లాన్.. ‘డబుల్ ఇళ్ల’కు బదులుగా మరో పథకం : గంగుల

by Sridhar Babu |   ( Updated:2021-08-12 05:13:02.0  )
minister-gangula
X

దిశ, మానకొండూరు : తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు బదులు రూ.5 లక్షలు చెల్లించే విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి దళిత బంధు ప్రారంభోత్సవ సన్నాహక సదస్సుకు ఆయనతో పాటు సాంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అందుకు ఉదాహరణే ‘దళిత బంధు’ పథకమని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వలన ఎంతో మందికి లబ్ది చేకూరిందన్నారు.

రానున్న రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు బదులు రూ. 5 లక్షలు ఇచ్చేలా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు పథకమని.. అది హుజురాబాద్‌లోనే కాకుండా రాష్ట్రం మొత్తంలో అమలు చేయనున్నట్టు చెప్పారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌నే ఎంచుకున్నామని.. ఈ నెల 16న హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నదని వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నియోజకవర్గం నుండి 15 వేల మంది కార్యకర్తలు తరలి రావాలన్నారు. దళిత బంధుపై ఎవరు నెగెటివ్ గా చెప్పిన నమ్మవద్దని.. దశల వారీగా రాష్ట్రంలో దళితబంధు అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed