బల్దియా.. ‘కరోనా’ సిబ్బందికి క్యా దియా?

by Shyam |   ( Updated:2020-04-20 12:38:55.0  )
బల్దియా.. ‘కరోనా’ సిబ్బందికి క్యా దియా?
X

దిశ, న్యూస్‌బ్యూరో: సిబ్బంది ప్రాణాలతో బల్దియా అధికారులు చెలగాటమాడుతున్నారు. ప్రజలందరినీ సామాజిక దూరం పాటించాలని చెబుతూ, అధికారులు ఖరీదైన మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతున్నారు. కానీ, బల్దియా పరిధిలో కింది స్థాయి సిబ్బంది ప్రాణాలు గాలిలో దీపంలా మారిపోతున్నాయి. వచ్చే ఎలక్షన్లలో చెప్పుకోవడం కోసం లాక్‌డౌన్‌లోనూ ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనులను, అభివృద్ధి పనులనే వేగంగా చేపట్టాలని బల్దియా పెద్దలు పావులు కదిపారు. మంచిదే.. కానీ, కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలేవీ అక్కడ కనిపించడం లేదు. రోడ్లు, సిమెంట్ పనుల్లో సామాజిక దూరం పాటించే అవకాశం లేదు. కనీసం అక్కడ మాస్క్‌లు, గ్లౌజ్‌లు కూడా కనిపించడం లేదు. నిత్యం వేల సంఖ్యలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సైతం ఇదే పరిస్థితి ఉండటం బల్దియాలో పేదల ప్రాణాలకు అధికారులు, ప్రభుత్వం పట్టింపు ఎంతుందో తేలిపోతుంది.

ఓట్ల కోసం వలస కార్మికుల ప్రాణాలు..

దేశమంతా లాక్‌డౌన్ మే 3 వరకూ ప్రకటిస్తే.. మన దగ్గర అదే నెల 7 వరకూ ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. దీన్ని బట్టే కరోనా తీవ్రతను, ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత అర్థం చేసుకోవచ్చు. బల్దియా అధికారులకు కిందిస్థాయి కార్మికుల ప్రాణాలు అంత పట్టింపులేనట్టు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌తో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని అభివృద్ధి పనులు తొందరగా పూర్తి చేయొచ్చంటూ ఎస్ఆర్‌డీపీ పనులను చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోగా.. మిగిలిన ఇతర రాష్ట్రాల కూలీలతో ఈ పనులు చేయిస్తున్నారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని బల్దియా పెద్దలు చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితిల్లో అది సాధ్యం కాదని అందరికీ తెలుసు. సాధారణంగా లాక్‌డౌన్ సమయంలో మిషనరీ పనుల వరకూ పర్వాలేదు. గుంపులుగా మనుషులు పనిచేస్తే కరోనా వ్యాపించే అవకాశం లేకపోలేదు. కనీసం ఈ పనులు చేస్తున్న వారికి మాస్క్‌లు, గ్లౌజ్‌లు కూడా ఇవ్వడం లేదు. సిమెంట్ పనులు చేసేందుకు అవసరమైన బూట్లు ఇస్తున్నారు. తప్ప కరోనా నివారణకు సంబంధించిన రక్షణ చర్యలేవీ వారిలో కనిపించడం లేదు.

నగరంలో పెండింగ్‌లో ఉన్న అన్ని ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. సరిగ్గా పదినెలలు కూడా లేని బల్దియా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు లాక్‌డౌన్ సమయంలో ఈ రోడ్లు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లాక్‌డౌ‌న్ లో చేయాల్సిన అత్యంత అవసరమైతే పనులైతే ఇవి కాదు.. ఓ వైపు వలస కార్మికులు ఆకలి, వసతి లేక అలమటిస్తుంటే అధికార పార్టీ పెద్దలు మాత్రం తమ రాజకీయాల కోసం పావులు కదుపుతున్నారు. కరోనా నివారణకు రోడ్ల మీదకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని చెబుతున్న బల్దియానే కార్మికులను తీసుకొచ్చి వారి అవసరం కోసం పనులు చేయించుకుంటుంది. తమ స్వార్థ రాజకీయాల కోసం వలస కార్మికుల ప్రాణాలను బలిపెడుతున్న బల్దియా ఇకనైనా మారాల్సి ఉంది. అభివృద్ధి పనులంటూ తప్పించుకొని చూడాల్సిన అవసరం లేదు. పని ప్రదేశాల్లో మిషనరీ పనులు చేసుకుంటూ, పనిచేసే సిబ్బందికి మాస్క్‌లు, గ్లౌజ్‌లు ఇచ్చి వారి ప్రాణాలను కాపాడాలని కార్మికులు కోరుకుంటున్నారు.

పారిశుధ్య కార్మికులకే దిక్కు లేదు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 20 వేల మంది కార్మికులు నిత్యం రోడ్లు, వీధులు శుభ్రం చేస్తున్నారు. ఇంటింటి చెత్తను తరలించడం దగ్గర నుంచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత వీరిపైనే ఉంది. పూర్తి స్థాయిలో మాస్క్‌లు, శానిటైజర్లు అందించే ప్రక్రియ మొదలై పది రోజుల కంటే ఎక్కువ కాలేదు. అడపాదడపా మాస్క్‌లు, శానిటైజర్లు ఇస్తున్నారు కానీ, వారిని సామాజిక దూరం పాటించకుండానే పని ప్రదేశాలకు, ఇండ్లకు తరలిస్తున్నారు. బల్దియా కార్మికులను తరలించేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కేటాయించారు. వీటిల్లో గుంపులు గుంపులుగా కార్మికులు ప్రయాణిస్తున్నారు. కార్మికుల సంఖ్యకు తగినన్నీ బస్సులు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి అని సెంట్రల్ జోన్‌లో ఓ సూపర్ వైజర్ చెప్పుకొచ్చారు. క్వారెంటైన్ జోన్‌లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర కార్మికులతో కలిసిపోతున్నారు. ఏ చెత్తలో ఏ వైరస్ ఉందో తెలియదు. అది ఎవరి నుంచి ఎవరికి వ్యాపిస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులను సామాజిక దూరం పాటించకుండానే బల్దియా తమ పనులు చేయించుకుంటుంది. వారిలో ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినా తోటి కార్మికులు, వారి కుటంబ సభ్యుల‌కు ప్రమాదం. వేల సంఖ్యలో జరిగే ప్రాణ నష్టానికి బల్దియా కారణం కావాల్సి వస్తుంది.

అందరికీ నీతులు చెప్పే బల్దియాలోనే కరోనా నివారణపై నిమ్మకు నీరెత్తినట్టు కనిపిస్తోంది. సొంత కార్మికులతో పాటు వలస కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేయిస్తున్న బల్దియా అధికార గణం ఇకనైనా మారాల్సి ఉంది. సామాజిక దూరం పాటించాలంటూ పోస్టర్లు, మైక్‌ల ద్వారా హోరెత్తిస్తున్న జీహెచ్ఎంసీ తమ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు అది అమలయ్యేలా చూసి వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ఇప్పటికిప్పుడే ఆ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు పూర్తి చేయాల్సిన అత్యవసరం ఏమీ లేదు. నిజానికి అనేకమార్లు పూర్తికాని ప్రాజెక్టుల కాల పరిమితిని పొడిగించుకుంటూ వెళ్లిన ఉదాహరణలు కోకొల్లలు. కాంట్రాక్టర్లు, రాజకీయాల కోసమే కాదు అప్పుడప్పుడు పేద కార్మికుల ప్రాణాల కోసం రోడ్ల నిర్మాణం ఆలస్యమైనా పర్వాలేదని బల్దియా ఇకనైనా గుర్తించాలి.

Tags: Telangana, GHMC, KTR, corona, SRDP, development, Migrant workers, sanitation

Advertisement

Next Story