- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రొటోకాల్’ లొల్లి.. ఖర్చులు ఫుల్లు.. బడ్జెట్ నిల్లు
దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఉన్నతాధికారులు వచ్చినపుడు ప్రొటోకాల్ సిబ్బంది ఏర్పాట్ల కోసం సొంతంగా ఖర్చుపెట్టుకోవాలి. బిల్లుల కోసం ఏండ్ల తరబడి అధికారులను బ్రతిమిలాడాలి. దీంతో ప్రొటోకాల్ డ్యూటీ అవినీతికి మూలంగా మారింది’ ఓ వీఆర్వో ఆవేదన ఇది. షాదీముబారక్, కల్యాణలక్ష్మి లబ్ధిదారుల జాబితా వచ్చిందంటే పంపిణీకి టెంట్ వేయాలి. సభ పెట్టాలి. ఎమ్మెల్యే మొదలు మంత్రి వరకు అందరినీ ఆహ్వానించాలి. దీంతో ప్రొటోకాల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల బాధ్యతలన్నీ రెవెన్యూ శాఖపైనే పడుతున్నాయి. షామియానాలు, కుర్చీలు, మైక్ సెట్లు, మంచినీటి సదుపాయం, చాయ్, బిస్కట్లు.. ఇలా అన్ని తహసీల్దార్లు, వీఆర్వోలే ఖర్చు పెట్టుకోవాలి. కనీసం రూ.10 వేలు ఖర్చవుతుంది. ఇక్కడే అవినీతి మొదలవుతుందని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి.
అన్నింటికీ రెవెన్యూ..
వీఆర్వో అంటే అధికారులందరికీ ఊడిగం చేసే ఉద్యోగమేననే ఆవేదన ఉంది. ఏ శాఖలో ఏ ఉద్యోగి చేయలేనన్ని విధులు మోపినట్లు చెబుతున్నారు. ప్రతి శాఖలోనూ 3-4 రకాల డ్యూటీలు మాత్రమే. రెవెన్యూలో మాత్రం, విధులు నిర్వర్తించే గ్రామం, మండలం, డివిజన్ కేంద్రం, జిల్లా హెడ్ క్వార్టర్ ఇలా ఎక్కడికి చెబితే అక్కడికి ఉరకాలి. దీనికి ఖర్చులు ఎవరు ఇస్తారు? వచ్చే జీతం కాస్తా బజార్లో రాకపోకలకు సరిపోతే కుటుంబాలు ఎలా గడపాలి? అందుకే ప్రొటోకాల్ డ్యూటీలపై విస్తృతంగా చర్చ జరగాలని వీఆర్వోలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం కార్యాలయ నిర్వహణకు బడ్జెట్ కేటాయించడం లేదు. గతంలో క్వార్టర్లీ రూ.25 వేలు వచ్చేది. ఇప్పుడా నిధులు అందడం లేదు. స్టేషనరీ, కంప్యూటర్ల విడి భాగాలు, క్యాట్రిడ్జీల కొనుగోళ్లు వంటివి జేబులో నుంచే ఖర్చు చేస్తున్నామంటున్నారు. నిర్వహణకు బడ్జెట్ కేటాయించడం ద్వారా అవినీతికి చెక్ పెట్టొచ్చునంటున్నారు. సభలు, సమావేశాలకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ ఉండాలి. ఎన్నెన్నో కొర్రీలు పెట్టి బిల్లులు నిలిపివేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
స్లాట్ వదిలేసి..
మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వచ్చారంటే చాలు.. ఎన్ని పనులు ఉన్నా వదిలేసి వాళ్ల దగ్గరికి తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పరుగెత్తాల్సిందే. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్లు, ఇతర పనుల కోసం స్లాట్లు బుక్ చేసుకున్నవారు కార్యాలయంలో వేచి చూస్తున్నా ప్రొటోకాల్ డ్యూటీ మాత్రం తప్పడం లేదంటున్నారు. ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే వేచి చూస్తోన్న జనం నుంచి విమర్శలు, వెళ్లకపోతే వారి ఆగ్రహానికి గురవుతామన్న ఆందోళన మధ్య నలిగిపోతున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు చెప్పారు. జమానా నుంచి ఈ ప్రొటోకాల్ డ్యూటీ రెవెన్యూశాఖకే పరిమితం చేశారు. ఎక్కడికి వెళ్లినా తమను తప్పనిసరిగా అధికారులు, సిబ్బంది ఫాలో కావాల్సిందేనని ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. ప్రోటోకాల్ విధులు అన్ని శాఖలకు విస్తరించడం ద్వారా రెవెన్యూ ఉద్యోగులకు భారం తగ్గుతుందని ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.