కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం ఎవరెవరు?

by Shyam |   ( Updated:2021-02-17 04:23:55.0  )
కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం ఎవరెవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌లో వర్గాలు తేలిపోయాయి. టీపీసీసీ చీఫ్ కోసం పోటీ పడుతున్న నేతల వైపు ఎవరెవరు ఉన్నారనేది స్పష్టమైంది. ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన రాజీవ్ రైతు భరోసా యాత్ర… కాంగ్రెస్‌లో ఎవరు ఎటు వైపు ఉన్నారనే అంశాన్ని తేల్చింది. ఇక అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుందనేదే తేలాల్సిన ప్రధానాంశం. రాష్ట్రంలో వర్గాల పరిస్థితి ఇలా ఉంటే… అటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా తన మద్దతును ఎటూ చెప్పక తటస్థంగా నిలిచారు. వాస్తవంగా రేవంత్‌రెడ్డి నిర్వహించిన రావిర్యాల రైతు రణభేరి సభకు ఠాగూర్ హాజరయ్యే అంశంలో సీనియర్లు అడ్డు చెప్పారు. అయితే పార్టీకి మైలేజ్ వస్తుందని గుర్తించిన ఠాగూర్ ఈ సభకు రావాలని అనుకున్నా.. వస్తే మాత్రం రేవంత్‌కు మద్దతు ఉంటున్నాడనేది స్పష్టమవుతుందని భావించారు. అందుకే అటు సీనియర్ల మాటను గౌరవించినట్టుగానే ఉండి సభకు దూరంగా ఉన్నారు. కానీ రేవంత్‌తో మాత్రం ప్రతి నిమిషం చర్చించారని, వివరాలు అడిగి తెలుసుకున్నారని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు.

వ్యతిరేకించింది కొందరే..

రేవంత్ ‌రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్రపై ముందు నుంచీ సీనియర్లు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే పాదయాత్రకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీలోని కొంతమంది నేతలను ఎగేశారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేర్వేరుగా పాదయాత్రలకు నిర్ణయం తీసుకున్నారు. అటు రేవంత్ యాత్ర సాగుతుండగానే… ఇటు భట్టి పాదయాత్ర షురూ చేశారు. పార్టీలోని కొంతమంది దీని వెనకుండి ప్రోత్సహించారని ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా రావిర్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభతో పార్టీలోని వర్గాలపై మరింత క్లారిటీ వచ్చింది.

వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంపట్ల పార్టీ. వర్గాలు అనేకం. నేతల మధ్య సమన్వయం అనేది భ్రమే. ఎందుకంటే ఒకరు ముందుకు వెళ్తుంటే చాలు.. వెనక్కి లాగే చేతులు కాచుకుని ఉంటాయి అనేది విశ్లేషకులు ఎప్పటి నుండో చెబుతున్న మాట. ఇదే నేపథ్యంలో పార్టీతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీలో చేరతానంటే సీనియర్లు ఎలా ఆహ్వానిస్తారు? ఎక్కడ తమకు పార్టీలో నష్టం వాటిల్లుతుందో అని రేవంత్ చేరికను వారంతా తొలి నుండి వ్యతిరేకించారని టాక్. కానీ అధిష్టానం నుంచి ప్రత్యేకమైన హామీ రావడంతో రేవంత్ రెడ్డి పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో పరిణామాలు ఎలా మారుతూ వచ్చాయో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వర్గం నిరూపించుకున్నట్టేనా..?

ఇప్పుడు కాంగ్రెస్‌లో రేవంత్ ‌రెడ్డి వర్గం తేలినట్టేనని అందరూ భావిస్తున్నారు. తాజాగా రావిర్యాల సభలో ఉత్తమ్, వీహెచ్, జానారెడ్డి, భట్టి, దామోదర రాజనర్సింహా, పొన్నాల, మధుయాష్కి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా పాదయాత్రను వ్యతిరేకించారు కూడా. కానీ మెజార్టీ నేతలు మాత్రం రేవంత్ కు అండగానే నిలిచారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎంపీలు సురేష్‌ షెట్కార్‌, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, కూన శ్రీశైలం గౌడ్‌, టి.రామ్మెహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, గంగారామ్‌, ప్రతాపరెడ్డి, ఇందిరా శోభన్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, దాసోజు శ్రావణ్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితోపాటు పలువురు డీసీసీ అధ్యక్షులు రేవంత్‌ సభకు హాజరయ్యారు. వీరంతా సీనియర్లపై సభా వేదికగా మండిపడ్డారు. దీంతో రేవంత్ రెడ్డి వర్గంగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇస్తే అభ్యంతరం లేదంటూ ఈ నేతలంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ సభలో YSR సూరీడు… ఎందుకొచ్చాడంటే..?

Advertisement

Next Story

Most Viewed