కొడుకును సీఎం చేసేందుకే సచివాలయం కూల్చివేత : రేవంత్

by Anukaran |   ( Updated:2020-07-10 07:57:55.0  )
కొడుకును సీఎం చేసేందుకే సచివాలయం కూల్చివేత : రేవంత్
X

దిశ, న్యూస్ బ్యూరో: వాస్తు పేరుతో ఎంతో చరిత్ర ఉన్న సచివాలయాన్ని కూల్చి వేయడం సీఎం కేసీఆర్‌కు మంచిది కాదని, 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సెక్రటేరియట్‌ను ఇప్పుడు కూల్చడం దారుణమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేసేందుకే సచివాలయం కూల్చివేస్తున్నారన్నారు. ఎంపీ రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సెంటిమెంట్ ఉండటం తప్పు కాదు కానీ, మూఢ నమ్మకాలు మంచిది కాదని రేవంత్ రెడ్డి సూచించారు. వందల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయని, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టును కూడా తప్పు దోవ పట్టించారని ఆయన విమర్శించారు. కనీసం మంత్రి వర్గంలో తుది నిర్ణయం తీసుకోలేదని, దీనిపై మేం కోర్టులో వేసిన పిటీషన్‌ను తిరస్కరించారని రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయానికి అన్ని రకాల పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. అందుకే సోనియా గాంధీ నేతృత్వంలో ఎన్జీటీని ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సచివాలయాన్నికూల్చి వేసిన గార్బెజ్‌ను ఎక్కడ వేస్తరో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయంలో మజీద్, నల్ల పోచమ్మ గుడి, చర్చిని కూడా కూల్చి వేశారని, తెలంగాణ ఉద్యమానికి నల్ల పోచమ్మ గుడి వేదికైందన్నారు. ఇప్పుడు స్వలాభం కోసం, మూఢ నమ్మకాల కోసం వాటిని కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని ఎంపీ మండిపడ్డారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు సీఎం కేసీఅర్ రాత్రికి రాత్రే పడగొట్టాలని ఆదేశించారన్నారు. కనీసం దీనిపై మాట్లాడకుండా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని, ఎవరినీ ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్ళకుండా చేసి కూల్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ సమీపంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయవద్దని సుప్రీమ్ కోర్టు తీర్పు కూడా ఉందని, ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా సచివాలయ కూల్చివేతను స్వాగతించడం సరైంది కాదని సూచించారు. సీఎం కేసీఆర్ మజీద్, నల్ల పోచమ్మ గుడి కూల్చితే బీజేపీ, మజ్లిస్ పార్టీల నేతలు ఎందుకు స్పందించడం లేదని, అంతేకాకుండా కొంతమంది స్వాగతించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగ సంఘాలకు నరేందర్ రావు, ముస్లిం మతాచారాలకు అసదుద్దీన్ ఒవైసీ వకల్తా ఏమి కాదని, మందిర్, మజీద్ పేరుతో ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని, మజ్లిస్, బీజేపీ, టీఆర్ఎస్‌లు అన్ని ఒకే తాటి ముక్కలని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ నిర్ణయం పై నిరసన : షబ్బీర్ అలీ

రాష్ట్రంలో ఇది బ్లాక్ డే అని, మందిర్, మజీద్‌లు దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో కొత్తవి కట్టిస్తా ఆనడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇవేమీ అయన సొంత ప్రాపర్టీ కాదని, తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశాలన్నారు. సీఎం కేసీఅర్ ప్రకటనను సమర్థిస్తూ మజ్లీస్ నేత ఓవైసీ ట్వీట్ సిగ్గుచేటుగా ఉందని, దీనిపై ముందే తాను సీఎం కేసీఆర్‌కి 2019లోనే లేఖ రాసినట్లు షబ్బీర్ అలీ చెప్పారు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ కలిసి పూజలు చేసి నల్ల పోచమ్మ విగ్రహాన్ని తొలగించారన్నారు. తన కొడుకును సీఎం చేయడం కోసం సీఎం కేసీఆర్ వాస్తు పేరుతో సచివాలయం కూల్చి వేయడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఏకీభవిస్తున్న ఓవైసీ ఇన్నేళ్లు బాబ్రీ మజీద్‌పై ఎందుకు రాజకీయం చేశారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

Advertisement

Next Story