టీఆర్ఎస్ నేతలను చీపురు కట్టలతో కొట్టాలి !

by Shyam |
టీఆర్ఎస్ నేతలను చీపురు కట్టలతో కొట్టాలి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో సంభవించిన వరదల అనంతరం బాధిత కుటుంబాలకు ఇస్తున్న ఆర్థికసాయం అధికార పార్టీ నేతల జేబులు నింపుతోందని, కమీషన్ దందా మొదలైందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు అందే సాయంలో సగం కమీషన్ రూపంలో స్థానిక అధికార పార్టీ నేతలు నొక్కేస్తున్నారని, స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతో అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 554కోట్లలో సగం టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకే పోయాయని, అధికారులు కూడా అందినకాడికి మింగేస్తున్నారని ఆరోపించారు. బస్తీలపై పడి అధికార పార్టీ నేతలు దోచుకుతింటున్నారని, గతంలో జయలలిత, శశికళ, లాలూప్రసాద్ యాదవ్ తరహాలోనే ఇకపైన కేసీఆర్ కూడా జైల్లో పడక తప్పదని హెచ్చరించారు.

ప్రజలు పన్నుల ద్వారా కట్టిన సొమ్మును ప్రభుత్వం పార్టీ సొమ్ము రూపంలో పంచిపెడుతోందని, పార్టీకి ఓటుబ్యాంకుగా ఉన్నవారికి మాత్రమే అందిస్తూ నిజమైన బాధితులకు ఇవ్వడంలేదని ఆరోపించారు. కూకట్‌పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత దృష్టికి కొన్ని విషయాలను తీసుకెళ్ళిన రేవంత్ రెడ్డికి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ జోన్ పరిధిలో వరద బాధితులకు అందించిన సహాయం వివరాలను ఇవ్వాల్సిందిగా కోరానని, కానీ ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మమత ఇచ్చిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్‌గా వ్యవహరించే అధికారికి ఎంపీకి వివరాలు ఇవ్వాలన్న నిబంధన కూడా తెలియదా అని ప్రశ్నించారు. పది రోజుల్లోగా ఇస్తానని మమత ఇచ్చిన సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి మూడు రోజుల్లోగా (మంగళవారం నాటికి) వివరాలు ఇవ్వకపోతే బుధవారం నుంచి ప్రజలతో నిరసనలు చేపట్టక తప్పదన్నారు.

జోనల్ కమిషనర్‌తో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో బాధిత కుటుంబాలకు రూ.1500 ఆర్థిక సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో వేసిన ప్రభుత్వం ఇప్పుడు రూ. 10 వేలను నగదు రూపంలో ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. అధికారులు, సిబ్బంది టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్ళకు లోనవుతున్నారని, నిస్సహాయులుగా మిగిలిపోయారని అన్నారు. వరదలకు బాధితులు కాకపోయినప్పటికీ, అపార్టుమెంట్లలోని పై అంతస్తుల్లో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నాయకులు పది వేల రూపాయలను పంచిపెడుతున్నారని, నిజమైన బాధితులకు అందడంలేదన్నారు. కూకట్‌పల్లి జోన్‌కు రూ. 73కోట్ల మేర కేటాయింపు జరిగితే రూ.56 కోట్లు పంచిపెట్టినట్లు జోనల్ కమిషనర్ బదులిచ్చారని, ఇందులో సుమారు పాతిక వేల మంది నిజమైన బాధితులకు సాయం అందనేలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

నగరం మొత్తం మీద సుమారు రూ. 450కోట్ల మేర పంపిణీ అయినట్లు అధికారులు పేర్కొంటున్నా అందులో సగం డబ్బు అధికార పార్టీ నేతల జేబుల్లోకే వెళ్ళిందని ఆరోపించారు. బుధవారం నుంచి జోనల్ కమిషనర్ కార్యాలయాలను ముట్టడించడంతో పాటు రోడ్డుపైనే వంటావార్పు చేస్తామని హెచ్చరించారు. ఓట్లు అడగడానికి గల్లీల్లోకి, బస్తీల్లోకి వచ్చే టీఆర్ఎస్ నేతలను మహిళలు చీపురుకట్టలతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story