ఏజెన్సీలో రెస్టారెంట్ నయా దందా..

by Sridhar Babu |   ( Updated:2021-10-30 02:24:11.0  )
ఏజెన్సీలో రెస్టారెంట్ నయా దందా..
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో ఓ రెస్టారెంట్ నయాదందా చేస్తోందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎత్తున రెస్టారెంట్ ను నిర్మించి అమాయకమైన గిరిజనుల నుంచి సెంట్రల్, స్టేట్ జీఎస్టీల పేరుతో భారీగా డబ్బులు వసూళ్ళు చేస్తున్నారని పలువురు మేధావులు చెబుతున్నారు. ఏజెన్సీలో మూడు అంతస్తులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా అధికారులను మచ్చికచేసుకొని విచ్చలవిడిగా ఈ అంతస్తులు, నిర్మించారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రెస్టారెంట్ నిర్మాణం గిరిజన బినామీ పేరుతో జరిగిందని, దానిపై నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అమాయకమైన గిరిజనులను ఆసరాగా చేసుకుని వారికి తులమో పలమో ఇస్తూ రెస్టారెంట్ పేరుతో దందాకు తెరలేపుతున్నారని పలువురి అభిప్రాయం. ఈ క్రమంలో బడాబాబులు గిరిజన చట్టాలకు విరుద్ధంగా మూడు, నాలుగు భవన అంతస్తులు నిర్మించి వాటిని రెస్టారెంట్ పేరుతో నడిపిస్తూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రెస్టారెంట్ లో లిఫ్ట్ కు అనుమతులు ఏ అధికారి ఇచ్చారు ? ఎలా ఇచ్చారు ? అనేది మండలంలో సంచలనంగా మారింది.

ఏజెన్సీ ప్రాంతంలో మూడు, నాలుగు అంతస్తులు నిర్మిస్తేనే ఊరుకొని అధికారులు బహుళ అంతస్తులు నిర్మించి వాటికి లిఫ్ట్ ల సహాయంతో నడుపుతున్నారంటే పంచాయతీ అధికారులు ఏవిధంగా అమ్ముడుపోయారనేది తెలిసిపోతోంది అని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. గిరిజన చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో లిఫ్ట్ లకు అనుమతులు లేవు. రెస్టారెంట్ కి లిఫ్ట్ అనుమతులు ఇచ్చిన పంచాయతీ అధికారులకు భారీగా ముడుపులు అందాయని అనుమానాలు ఉన్నాయి. దాంతో ఇప్పటికైనా ఐటీడీఏ జిల్లా అధికారులు గిరిజన చట్టాలను కాపాడాలని, రెస్టారెంట్ యజమాని పైనా, అనుమతులు ఇచ్చిన అధికారుల పైనా చర్యలు తీసుకోవాలని, గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed