సింగింగ్ సోల్జర్.. యుద్ధ భూమిపై మరవలేని గాయకుడు

by Shyam |
సింగింగ్ సోల్జర్.. యుద్ధ భూమిపై మరవలేని గాయకుడు
X

దిశ, ఫీచర్స్ : కొన్ని కథలు ఇంకా చరిత్ర గర్భంలోనే ఉండిపోయాయి. ఎంతోమంది ధీరులు, వీరులతో పాటు కళాకారులకు గుర్తింపు దక్కలేదు. అలాంటి ఓ అద్భుత పాటగాడే కెప్టెన్ రామ్ సింగ్. ‘సింగింగ్ సోల్జర్‌’గా పేరుపొంది భారత జాతీయ గీతంతోపాటు మరెన్నో ఐకానిక్ పాటలకు ట్యూన్ అందించాడు. భరత భూమిపై యుద్ధం, ఉద్రిక్తలు కొనసాగుతున్న కాలంలో లక్షలాదిమంది భారతీయులను తన సంగీత ధ్వనితో ఏకం చేశాడు. చాలామంది అతని పేరు గుర్తుకు తెచ్చుకోకపోయినా అతని శౌర్యం పాటల ద్వారా తన ఆత్మ మన హృదయాల్లో సజీవంగా ఉంటుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న ఈరోజు కూడా దేశవ్యాప్తంగా అతడి పేరు నర్మగర్భంగా ప్రతిధ్వనిస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున ఆ సైనికుడి విశేషాలు.

ఆగష్టు 15, 1914న హిమాచల్‌ప్రదేశ్, ధర్మశాల సమీపంలోని భాగ్సు ఖనియారా గ్రామంలో రామ్ సింగ్ జన్మించాడు. అతని తండ్రి హవల్దార్ దిలీప్ సింగ్ రామ్ సింగ్‌ను ఆర్మీలో చేరేలా నిత్యం ప్రేరేపించేవాడు. స్కూలింగ్ పూర్తి కాగానే 1927‌లో ధర్మశాల కంటోన్మెంట్‌లోని IIవ గూర్ఖా రైఫిల్స్‌ బ్యాండ్‌లో రిక్రూట్ బాయ్‌గా అతడిని చేర్పించాడు. రామ్ సంగీతం నేర్చుకునేందుకు తాత ప్రేరణగా నిలవగా, అతడు ప్రఖ్యాత బ్రిటిష్ సంగీతకారులైన హాడ్సన్, డానిష్ నుండి బ్రాస్ బ్యాండ్, స్ట్రింగ్ బ్యాండ్, ఆర్మీలో డ్యాన్స్ బ్యాండ్‌లో శిక్షణ పొందాడు. శాస్త్రీయ పాశ్చాత్య సంగీతంతో పాటు బల్లాడ్, ఫుట్‌బాల్, కుస్తీని ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో 1927లో ధర్మశాల కంటోన్మెంట్‌ సైన్యంలో చేరగా.. కెప్టెన్ రామ్ సింగ్ 1941లో కంపెనీ హవల్దార్ మేజర్‌గా పదోన్నతి పొందాడు. 1941లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రామ్ సింగ్ తన యూనిట్‌తో కలిసి సింగపూర్‌, మలయాకు పంపబడ్డాడు. జపనీస్ దళాలు మలయా-థాయ్‌లాండ్ సరిహద్దుపై దాడి చేయడంతో బ్రిటీష్ సైన్యం తిరోగమనం కాగా.. దాదాపు 200 మంది భారతీయ సైనికులను జపనీయులు అరెస్టు చేశారు. ఆ యుద్ధ ఖైదీల్లో రామ్ కూడా ఉండగా పోలీసులు పెట్టిన హింసలు తట్టుకుని, బయటపడ్డ అతికొద్ది మందిలో అతడు ఒకడు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ లీడ్ చేస్తున్న ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’(INA)లో చేరి బ్రిటీష్ రాజ్యం నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడంలో సహాయం చేశాడు. బోస్‌తో కలిసి పనిచేస్తున్న సమయంలోనే రామ్ సంగీత ప్రతిభను గుర్తించి, స్వయంగా అతడిని ఐఎన్ఏ బ్యాండ్ మాస్టర్‌గా నియమించుకున్నాడు.

దేశభక్తి స్ఫూర్తిని ప్రేరేపించే ట్యూన్‌లను రూపొందించడానికి బోస్ రామ్ ప్రతిభను ఉపయోగించుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆది నుంచి అంతం వరకు పాట ప్రజల్లో చైతన్యం రగిలించాలి. చెరగని ప్రభావాన్ని కలిగి ఉండాలి. క్యాథే భవనం రెండు భాగాలుగా ‘విచ్ఛిన్నం’ కావాలి. వారికి ఆకాశం కనిపించాలి. దేవతలు త్రివర్ణ పతాకంపై నేరుగా పూలవర్షం కురిపించాలి. అంతలా శక్తివంతమైనదిగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఐఎన్ఏ సైనికులు అదే విధంగా లక్షలాది మంది భారతీయుల ఆత్మను కదిలించాలి’ అంటూ పాట నేపథ్యాన్ని నేతాజీ, రామ్‌కు వివరించాడు. నేతాజీ భావానికి రామ్ అందించిన పాటే ‘కౌమీ తరానా’. అక్టోబర్ 31, 1943న ఐఎన్ఏ అధికారంలోకి రాగా రామ్ ఆర్కెస్ట్రా కౌమీ తరానా ఆలపించగా.. క్యాథే భవనం ఉరుములతో ప్రతిధ్వనించింది. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు అంటూ యావత్ సైనికులు ప్రశంసించారు. ఈ పాటే ఐఎన్‌ఏ నేషనల్ ఆంథెమ్‌గా మారింది. పాట వచ్చిన సమయంలో దాదాపు 30 లక్షల మంది భారతీయులు ఈ పాట పాడగా, దాని ప్రభావ స్ఫూర్తి ప్రకంపనలుగా దేశమంతా ప్రతిధ్వనించినట్లు చరిత్ర చెబుతోంది.

1944లో రామ్‌‌సింగ్‌ సంగీత ప్రతిభను మెచ్చిన సుభాష్ చంద్రబోస్ అతడిని బంగారు పతకంతో సత్కరించాడు. నేతాజీ ఆర్మీలో ఇదే అత్యున్నత పురస్కారం కాగా భారత ప్రభుత్వం చారిత్రాత్మక రోజున ఆ బంగారు పతకం రామ్‌కు అందజేయాలని కోరుకుంది. కానీ అది జరగలేదు. తర్వాత జనరల్ లోకానంద్ జనవరి 23న ఐఎన్ఏ అధికారుల సమక్షంలో రంగూన్‌లో ఈ బంగారు పతకాన్ని అందజేశారు. కొన్నేళ్ల తర్వాత ఢిల్లీలో మహాత్మా గాంధీ సమక్షంలో ‘కౌమీ తరానా’ పాటను పాడే అవకాశం వచ్చింది. అంతేకాదు ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కెప్టెన్ రామ్ సింగ్ ప్రత్యేకంగా తన ఆర్కెస్ట్రా గ్రూప్ సభ్యులతో కలిసి కౌమీ తరానా ట్యూన్ ప్లే చేయడం విశేషం.

ఆర్మీ మ్యాన్, సంగీతకారుడైన రామ్ సంగీత ప్రతిభకు ‘కదం సే కదమ్ బడాయే జా, ఖుషి కే గీత్ గయే జా, యే జిందగీ హై కౌమ్ కీ, ఇసే కౌమ్ పే లుటాయే జా’ మరో మచ్చుతునక. తన సూపర్‌హిట్ మ్యూజికల్ మెలోడీల్లో ఇదీ ఒకటి. ఈ పాటకు సాహిత్యం కూడా అతడే అందించాడు. కాగా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన దేశ జాతీయ గీతం ‘జన గణ మన’కు సంగీతం అందించింది కూడా రామ్ సింగే. కెప్టెన్ రామ్‌కు 1947‌లో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ‘ఎమెరిటస్ మ్యూజిషియన్’ బిరుదును ప్రదానం చేయగా అద్భుతమైన స్వరకర్తను ఉత్తర ప్రదేశ్, సిక్కిం ప్రభుత్వాలు అనేక పురస్కారాలతో సత్కరించాయి. 1948లో కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూరి తన ఆర్కెస్ట్రా బృందంతో పాటు ఉత్తర ప్రదేశ్ పీఏసీ బ్యాండ్‌లో నియమించబడగా 1974లో పదవీ విరమణ పొందాడు. 2002లో 87 ఏళ్ల వయస్సులో లక్నోలో మరణించాడు. బ్రిటీష్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తీవ్రంగా పోరాడుతున్న ఐఎన్ఏ సైనికులకు అతని పాటలు గొప్ప స్ఫూర్తిదాయకం. అయితే కెప్టెన్ రామ్ సింగ్ జన‌గణ‌మన స్వరకర్తగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.

‘మేము ఢిల్లీలోని కాబూల్ లైన్ కంటోన్మెంట్‌లో ఖైదు చేయబడ్డాం. రాత్రి 7గంటలకు మా బ్యారక్ ముందు రెండు, మూడు కార్లు ఆగాయి. అందులోని ఒక కారు నుంచి బాపూజీ దిగగా.. ఆయనతో పాటు సర్దార్ పటేల్ ఉన్నారు. మేమంతా క్యూలో నిల్చుని ఉన్నాం. ప్రతీ ఐఎన్‌ఏ సైనికుడి పేరు, గ్రామం గురించి బాపూజీ అడిగారు. కౌమీ ‌తరానా పాట పాడాలని తమ సైనికులు కోరుకుంటున్నట్లు ఐఎన్‌ఏ జనరల్ భోంస్లే సర్దార్ పటేల్‌కి విన్నవించారు. దానికి ఆయన ఓకే చెప్పడంతో పాట పాడాం’ అంటూ కెప్టెన్ రామ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Advertisement

Next Story