పెళ్లి పత్రికలో పేరు.. నలుగురి ప్రాణాల మీదికి తెచ్చింది

by Sumithra |   ( Updated:2021-06-20 01:46:35.0  )
wedding card names fight news
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లి అన్నాక బంధువుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కట్నం ఇవ్వలేదనో, భోజనాలు బాలేవని, మర్యాదలు సరిగ్గా చేయలేదని బంధువులు గొడవలు పడుతుండడం చూస్తూనే ఉంటాం. కానీ పెళ్లి పత్రికలో బంధువుల పేర్లు ముద్రించలేదని బంధువులు వరుడు కుటుంబ సభ్యులపై దాడిచేసిన ఘటన హైదరాబాద్ నగరం లో వెలుగుచూసింది వివరాలలోకి వెళితే..

సికింద్రాబాద్ తుకారాంగేట్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్ కి చెందిన సురేష్ అనే వ్యక్తికి జూన్ 17 న వివాహమైంది. వివాహానికి బంధువులందరూ విచ్చేశారు. ఆ బంధువుల్లో సర్వేశ్ అనే వ్యక్తి పెళ్లి పత్రికలో తన పేరు ఎందుకు ముద్రించలేదని పెళ్లిరోజే గొడవకు దిగాడు. వరుడు సోదరిని, వారి కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో వరుడు కుటుంబసభ్యులు సర్వేశ్ కి సర్దిచెప్పి ఆరోజు వివాహం కానిచ్చేశారు. ఇక ఆదివారం ఈ విషయమై మాట్లాడాలని చెప్పి వరుడు కుటుంబ సభ్యులు సర్వేశ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రేకుడైన సర్వేశ్, అతని సోదరుడు శేఖర్ ఇంటికి వచ్చిన వారిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వరుడు సురేష్ బంధువులయిన ఎస్ ప్రవీణ్(30), నోముల పరశురాము(35), డి యాదగిరి (42), ఎన్ ప్రతాప్ కుమార్ లు (32) తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సర్వేశ్ ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story