ఫలితం ఊహించే ఆ ఇద్దరూ దూరంగా ఉన్నారా?

by Shyam |   ( Updated:2021-11-02 06:16:15.0  )
KCR KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ కీలకమైనదిగానే భావించింది. ‘ఇజ్జత్ కా సవాల్’ తరహాలో పరిగణించింది. అందుకే ఐదారు నెలల పాటు తన సైన్యాన్ని మోహరించింది. మండలానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యే చొప్పున రంగంలోకి దించింది. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ప్రచారానికి దూరంగానే ఉండిపోయారు. క్షేత్రస్థాయి పరిస్థితి అనుకూలంగా లేనందువల్లనే వీరిద్దరూ ప్రచారానికి వెళ్లలేదనే చర్చలు నియోజకవర్గంలో భారీ స్థాయిలోనే జరిగాయి. ఎలాగూ ఆ స్థానం చేజారిపోతున్నదని ముందుగానే గ్రహించి సభ పెట్టినా ప్రయోజనం లేదనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఆంక్షలను సాకుగా చూపి దూరంగా ఉన్నట్లు బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపించాయి.

సభ పెట్టిన తర్వాత కూడా హుజూరాబాద్‌లో ఓడిపోతే అది కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్‌ డ్యామేజీ కావడానికి దారి తీస్తుందని, అందువల్లనే ఎలాగూ ఓటమి తప్పదనే భావనతో దూరంగా ఉండిపోయారనే వాదనా తెరపైకి వచ్చింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలనే అనుకోలేదు. ‘అది చాలా చిన్న ఎన్నిక. ఓడిపోతే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేదీ లేదు. గెలిస్తే కేంద్రంలో అధికారంలో చేరేదీ లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. పైగా అక్కడి గెలుపు బాధ్యతలను హరీశ్‌రావు చూసుకుంటున్నందున కేటీఆర్ వేలు పెట్టలేదు. అటు పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇద్దరూ హుజూరాబాద్‌కు దూరంగానే ఉండిపోయారు.

గెలిచినా ఓడినా హరీశ్‌రావుదే బాధ్యత అయింది. నిజానికి అక్టోబరు 26, 27 తేదీల్లో భారీ స్థాయి బహిరంగసభను నిర్వహించనున్నట్లు పార్టీ నిర్ణయం తీసుకున్నది. అప్పటికి పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడుతుందనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నిత్యం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారాన్ని తెప్పించుకుంటున్న కేసీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన బహిరంగ సభ ఆంక్షలు కలిసొచ్చినట్లయింది. సభ షెడ్యూలును రద్దు చేసుకోక తప్పలేదు. సభ పెట్టినట్లయితే పార్టీ గెలిచి ఉండేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ గెలిచే పరిస్థితి లేనందువల్లనే ఇద్దరూ దూరంగా ఉన్నారని ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed