ఆజాదీ ఎవరి నుంచి ఎవరికీ?

by Ramesh Goud |
ఆజాదీ ఎవరి నుంచి ఎవరికీ?
X

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ షహీన్‌బాగ్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులు ‘వీ వాంట్ ఆజాదీ’ అంటూ నినాదాలు ఇవ్వడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వారు శాంతి యుతంగా చేసుకోవచ్చని కానీ ఆజాదీ పేరుతో నినాదాలు చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. అసలు ఆజాదీ ఎవరి నుంచి ఎవరికీ కావాలని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. వాళ్లేమైనా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, సీఏఏ వ్యతిరేక దారులతో చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే చర్చలు ఓ పద్ధతి ప్రకారం జరగాలని ఆయన ప్రకటించారు. సీఏఏ ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, ఏ భారత పౌరుడి పౌరసత్వాన్నీ తొలగించబోమని పునరుద్ఘాటించారు.

ఈ ఆందోళనలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చినవి కావని, కొన్ని రాజకీయ పార్టీలు నిధులిచ్చి మరీ నడిపిస్తున్నారని ఆరోపించారు. షహీన్‌బాగ్ రోడ్డును మూసేయడంతో చాలా మంది ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని, అంతటి ప్రజా సమూహం ముందు మూడొందల మంది ఆందోళనకారులు అసలు లేక్కే కాదని అన్నారు.

మతాలకతీతంగా భారతదేశం అందరిదని ఎన్నికల కంటే ముందే ప్రధాని మోదీ ప్రకటించారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ముస్లింలకు కూడా పద్మశ్రీని ప్రకటించిందని అలాంటిది మనదేశంలోని ముస్లింలకు ఎలా చెడు చేస్తామని పేర్కొన్నారు. ఎన్పీఆర్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సారథ్యంలోని యూపీఏనే ప్రతిపాదించిందని, తమ ప్రభుత్వం కేవలం దానిని ముందుకు తీసుకెళ్తున్నట్టు రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story