నవంబర్ వరకూ వాన ‘గండం’

by Anukaran |   ( Updated:2020-10-19 04:07:20.0  )
నవంబర్ వరకూ వాన ‘గండం’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి వాన‌ల బుగులు ప‌ట్టుకుంది. ఈసారి వర్షాలు నవంబర్ వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా వానాకాలం ముగిసినా వానలు దంచి కొడుతున్నాయి. నవంబర్ వరకూ వర్షాలు కొనసాగుతూనే చలి ప్రభావం కూడా పెరగనుంది. నవంబర్ తొలి వారం నుంచే చలి విజృంభించనుంది. ఈ వానాకాలం అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడటంతో వర్షాలు అంచనాకు మించి కురిశాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బంగాళాఖాతంలో 9 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఒక వాన నుంచి తేరుకునేలోపే మళ్లీ వానలు కురిశాయి.

అక్టోబర్ నెలలో కూడా అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఒక దాని వెనుక మరో అల్పపీడనం ఏర్పడుతోంది. మ‌ధ్య బంగాళాఖాతంలో సోమ‌వారం అల్ప‌పీడ‌నం ఏర్పడే అవ‌కాశం ఉంది. ఇది మంగ‌ళ‌వారం నాటికి మ‌రింత బ‌ల‌ప‌డొచ్చు. మ‌రోవైపు ద‌క్షిణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీరానికి ద‌గ్గ‌ర‌లో ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. ఈ రెండింటి ప్ర‌భావంతో రాష్ర్టంలోని చాలా ప్రాంతాల్లో నాలుగు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ కేంద్రం డైరెక్ట‌ర్ నాగ‌ర‌త్న తెలిపారు.

ఇక ఆదివారం మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిశాయి. తెలంగాణ వ్యాప్తంగా 13 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 19 సెం.మీ, రంగారెడ్డిలో 17.2, హైదరాబాద్‌లో 16.3 సెం.మీ. వర్షపాతం ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, వికారాబాద్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, మహబూబాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షం కురిసింది. మొత్తం అక్టోబర్ 18 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 793.7 మి.మీ ఉండగా ఆదివారం నాటికి 1228.7 మి.మీ కురిసింది. ఆరు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఎక్సెస్ వర్షపాతం నమోదైంది.

నేటి నుంచి మరింత జాగ్రత్త

భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చినుకు పడితేనే భయాందోళనలో ఉంటున్నారు. అల్పపీడన ప్రభావంతో సోమ‌వారం భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్ర‌ధానంగా మంగ‌ళ‌, బుధవారాల్లో ద‌క్షిణ తెల‌లంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురవొచ్చ‌ని వెల్ల‌డించారు. లోత‌ట్టు ప్రాంతాల‌వారు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని పేర్కొన్నారు. ఈశాన్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా అల్పపీడనం మారిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఓ వైపు వర్షాలు.. మరో వైపు కరోనా..

మరోవైపు వర్షాల ప్రభావం హైదరాబాద్‌పై అధికంగా ఉంది. ఐదు రోజులుగా పలు కాలనీలు, బస్తీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ఇల్లు వదిలి పునరావాస కేంద్రాల్లో, బంధుమిత్రుల ఇళ్లలో బాధితులు తల దాచుకున్నారు. వరద నీటితో ఇళ్లలోని వస్తువులు పాడయ్యాయేమో అన్న ఆందోళన ఓ వైపు.. పునరావాస కేంద్రాల్లో కరోనా సోకుతుందేమో అన్న భయం మరో వైపు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

చలి కూడా విజృంభణ

ఇప్పటికే అధిక వర్షాలు కురువగా.. నవంబర్ నుంచి చలి కూడా ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 1988 నుంచి వర్షాల్లో ఇదే అత్యధికంగా నమోదయ్యాయి. అయితే నవంబర్ నెల వరకూ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న అధికారులు.. నవంబర్‌లోనే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మంచు ఎక్కువగా కురుస్తుందని చలి విజృంబిస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Advertisement

Next Story