వెదర్ అలర్ట్: ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు

by srinivas |
వెదర్ అలర్ట్: ఏపీలో వారం రోజుల పాటు వర్షాలు
X

దిశ, ఉత్తరాంధ్ర: చెన్నై వద్ద తీరం దాటిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా రూపాంతరం చెందింది. దీంతో తమిళనాడు ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మధ్య తమిళనాడు నుంచి కోస్తాంధ్ర తీరం మీదుగా, ఉత్తర ఒడిసా తీరం వరకు ఈ ద్రోణి వ్యాపించింది. దీంతో నేడు దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా ఏర్పడి, తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం బలపడి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయు గుండంగా మారే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.

అయితే ఇది వాయుగుండంగా తీరం దాటుతుందా? లేక తుఫాన్ గా మారుతుందా? అనే విషయంలో స్పష్టత లేదని తెలిపింది. ఒక వేళ తీవ్ర వాయుగుండంగా ఉంటే మధ్య కోస్తా దిశగా వస్తుందని, ఒకవేళ తుపాన్ గా మారితే మాత్రం తమిళనాడులో తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణశాఖ సూచించింది.

Next Story