బీఏసీ మీటింగ్​కు పిలవరా? ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

by Shyam |   ( Updated:2021-09-24 09:08:29.0  )
బీఏసీ మీటింగ్​కు పిలవరా?  ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యేలను బిజినెస్ ​అడ్వైజరీ కమిటీ సమావేశానికి టీఆర్ఎస్​ సర్కార్ ఆహ్వానించకపోవడంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్​రావు ఫైరయ్యారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటి బీఏసీ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ను ఆహ్వానించారని, అయితే రెండో సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మజ్లిస్ ​ఆదేశాలతోనే ఈ సమావేశానికి పిలవలేదని దుబ్బాక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు పోతున్నారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు ఇలా ఏనాడూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై చిన్నచూపు చూడలేదని, ఒక్కరున్నా, ఇద్దరున్నా బీఏసీ సమావేశానికి ఆహ్వానించేవారని పేర్కొన్నారు. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ అంశంపై స్పీకర్​ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. శాసనసభ మర్యాదలు పాటించాలని, సంప్రదాయం ప్రకారం సభ నిర్వహించాలని ఆయన స్పీకర్ ను కోరారు. శాసనసభ హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్​పై ఉందన్నారు.

బ్రిటన్​కు లిఖితపూర్వకంగా రాజ్యాంగం లేదని, అయినా అక్కడ సభ మర్యాదలు పాటిస్తారని రఘునందన్​రావు పేర్కొన్నారు. మనకు లిఖిత పూర్వక రాజ్యాంగం ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలను సైతం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ​నియంతృత్వ పాలనకు ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ 80 వేల పుస్తకాలు చదివారని చెబుతారని, అలాంటిది ఆయనకు ఇద్దరు ఎమ్మెల్యేలున్నా, ఒక్కరున్నా బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్కరు, ఇద్దరు శాసనసభ్యులుంటే పిలవొద్దని ఏమైనా రాజ్యాంగంలో పొందుపరిచారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీటీడీపీకి పట్టిన గతే భవిష్యత్​లో టీఆర్ఎస్​కు పడుతుందని రఘునందన్​రావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed