బ్లాక్ లైవ్స్ మ్యాటర్ వివాదంపై డికాక్ క్లారిటీ

by Shyam |
బ్లాక్ లైవ్స్ మ్యాటర్ వివాదంపై డికాక్ క్లారిటీ
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ ఆట నుంచి తప్పుకున్నాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి సంఘీభావంగా మోకాళ్లపై నిలబడాల్సి వస్తుందనే డికాక్ ఆ మ్యాచ్ ఆడలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తాజాగా డికాక్ వివరణ ఇచ్చాడు. ‘నేను జట్టుకు, ఆటగాళ్లకు, దేశ ప్రజలకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా హక్కులు లాగేసుకుంటున్నారని భావించి తాను ఆ మ్యాచ్ ఆడలేదు. కానీ దీని వల్ల తనపై రేసిస్ట్ అనే ముద్ర వేశారు. దీనికి చాలా బాధపడ్డాను. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ మ్యాచ్‌కు ముందు కచ్చితంగా మోకాళ్లపై నిలబడాలని ఆదేశిస్తే.. నా హక్కులు హరిస్తున్నారని బాధపడ్డాను.

కానీ, గత రాత్రి నేను బోర్డుతో మాట్లాడిన తర్వాత పూర్తి అవగాహన వచ్చింది. నేను బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. జాత్యహంకార ఘటనలకు వ్యతిరేకంగా నిలబడటం ఎంత అవసరమో నాకు తెలుసు. ఇది మా బాధ్యత. నేను మోకాళ్లపై నిలబడితే ప్రజల జీవితాలు మెరుగవుతాయని అనుకుంటే అంతకు మించిన సంతోషం లేదు. నేను మ్యాచ్ ఆడకపోవడం వల్ల ఎవరినీ కించపరచలేదు’ అని డికాక్ వివరించాడు. కాగా అంతకు ముందు ఒక మ్యాచ్‌లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు సంఘీభావం తెలపాలని కోరినప్పుడు మైదానంలో కెప్టెన్ తెంబా బవుమా మోకాళ్లపై నిలబడగా.. ఇతర ఆటగాళ్లు వారికి ఇష్టం వచ్చిన రీతిలో సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో డికాక్ అందరినీ చూస్తూ నిల్చున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అందరూ మోకాళ్లపై నిల్చోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story