వ్యాక్సిన్ ఉంది.. జనమే లేరు.. టీకాపై వీడని సందేహాలు

by Sridhar Babu |   ( Updated:2021-09-18 04:51:16.0  )
వ్యాక్సిన్ ఉంది.. జనమే లేరు.. టీకాపై వీడని సందేహాలు
X

దిశ, కాటారం : కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన టీకాపై ఇంకా జనంలో అపోహలు వీడటం లేదు. ఆస్పత్రుల్లో టీకా నిల్వలు ఉన్నా జనం ముందుకు రావడం లేదు. ఓ వైపు మూడోదశ వ్యాప్తి ఉంటుందని హెచ్చరికలు వస్తున్న తరుణంలో వ్యాక్సిన్ తీసుకుంటేనే మహమ్మారి నుంచి రక్షణ ఉంటుందని చెబుతున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. కరోనా వైరస్‌తో రెండు దశల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది.

వేలాది జనం మహమ్మారి బారిన పడగా పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఆర్థికంగానూ చాలా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కరోనా రెండో దశ సమయంలో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ ఉండేది. దాదాపు రెండు నెలలుగా కేసులు తగ్గడంతో టీకా కేంద్రాలకు జనం రాక తగ్గిపోయింది. వాక్సినేషన్ ప్రారంభమైన రోజుల్లో ప్రజలు టీకా కోసం పోటీపడ్డారు. మొదటి డోస్ తీసుకున్నవారు, రెండో డోస్ కోసం నెలల తరబడి నిరీక్షించారు. ఇప్పుడు వ్యాక్సిన్ నిల్వలు ఉండగా జనం లేక.. వైద్య సిబ్బంది టీకా ఇచ్చేందుకు ప్రతీరోజు ఆస్పత్రుల్లో ఎదురుచూస్తున్నారు. టీకా పట్ల ప్రజల్లో ఇంకా అపోహలు వీడకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఇవీ అపోహలు..

– వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుంది.
– కరోనా వైరస్ రెండుసార్లు విజృంభించిన సమయంలో కూడా నాకేం కాలేదు ఇప్పుడు ఏం కాదు.
– టీకా తీసుకునేందుకు సమయం ఉందిగా తరువాత చూద్దాంలే
– దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి తీసుకుంటే అవుతుందేమో
– గ్రామాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.

100% టీకాల కోసం గ్రామాల్లో క్యాంపులు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కాటారం, మహాముత్తారం, మల్హర్, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో ఎంపిడిఓలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు. అర్హులైన వారికి 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకూ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామారావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed