పబ్‌జీ రీఎంట్రీ..

by Shyam |   ( Updated:2020-09-08 08:53:11.0  )
పబ్‌జీ రీఎంట్రీ..
X

దిశ, వెబ్ డెస్క్ :

దేశ‌వ్యాప్తంగా ఉన్న పబ్‌జీ ప్రియుల‌కు పబ్‌జీ కార్పొరేష‌న్ ఓ తియ్యటి వార్త చెప్పింది. పబ్‌జీ మొబైల్‌, పబ్‌జీ మొబైల్ లైట్ గేమ్‌ల‌కు ప‌బ్లిషింగ్ హ‌క్కుల‌ను తామే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తామ‌ని, చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్‌తో త‌మ‌కు ఎలాంటి సంబంధం ఉండ‌ద‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టి వ‌రకు ఈ రెండు గేమ్స్‌కు టెన్సెంట్ కంపెనీ ప‌బ్లిషర్‌గా ఉంది. పబ్‌జీ మొబైల్‌‌తో పాటు పబ్‌జీ మొబైల్ లైట్, ఇతర 116 చైనీస్-ఆధారిత గేమ్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. పబ్‌జీ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. టెన్సెంట్‌తో సంబంధాలు తెంచుకోవడంతో.. పబ్‌జీ గేమ్ భార‌త్‌లో మ‌ళ్లీ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తాము ఆశిస్తున్నామ‌ని తెలియ‌జేసింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పబ్‌జీ టాప్ పొజిషన్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ గేమ్‌కు భారత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. భారత్‌లో పబ్‌జీ గేమ్‌ యాప్‌ను 50 మిలియన్‌ మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 35 మిలియన్లకు పైగా యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. మొదట దక్షిణ‌ కొరియా తయారు చేసిన పబ్జీ గేమ్‌ను డెస్క్‌టాప్‌ వర్షన్‌లోనూ ఆడొచ్చు. తరువాత సౌత్‌ కొరియా నుంచి లైసెన్స్‌ పొందిన చైనా కంపెనీ టెన్సెంట్.. పబ్జీ మొబైల్‌, పబ్జీ మొబైల్‌ లైట్‌ యాప్‌ను తీసుకువచ్చింది. అయితే, భారత్‌లో నిషేధం విధించడంతో పబ్‌జీ కార్పొరేష‌న్ కేవ‌లం భార‌త్‌లో మాత్ర‌మే టెన్సెంట్ గేమ్స్‌తో ఉన్న సంబంధాన్ని క‌ట్ చేసుకుంది. ఇత‌ర దేశాల్లో టెన్సెంట్ గేమ్స్‌తో వ్యాపార సంబంధాలు అలాగే ఉంటాయి. దీంతో ఈ పూర్తిగా చైనాయేత‌ర కంపెనీ చేతుల్లోనే ఈ గేమ్ ఉన్న‌ట్లు అవుతుంది. ఈ క్ర‌మంలో గేమ్‌పై ఉన్న నిషేధాన్ని భార‌త ప్ర‌భుత్వం ఎత్తివేస్తుంద‌ని ప‌బ్‌ జీ కార్పొరేష‌న్ భావిస్తోంది. మరి కేంద్రం ఈ విషయం మీద ఎలా స్పందిస్తుందోనని, గేమర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story