రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన.. ఇది ఆరంభం మాత్రమేనంట!

by Shyam |   ( Updated:2021-11-12 04:39:06.0  )
dharna-12
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రైతు పక్షాన అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం ధర్నా చేపట్టింది. పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యాసంగిలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామన్నారు. పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో జరిగిన మహాధర్నాలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో జరిగిన ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

అదేవిధంగా మేడ్చల్ లోని జాతీయ రహదారిపై జరిగిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి పాల్గొనగా మహేశ్వరంలో జరిగిన ధర్నాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో వరంగల్ ఖమ్మం రహదారిపై జరిగిన ధర్నాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో జరిగిన ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ లో జరిగిన ధర్నాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, నిర్మల్ లో జరిగిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొనగా, వర్ధన్నపేటలో జరిగిన ధర్నాలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో జరిగిన ధర్నాలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు వాణి దేవి, దయానంద్ తోపాటు హైదరాబాద్ లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాట్లాడుతూ .. వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిర‌సిస్తూ ధ‌ర్నా చేప‌ట్టామ‌న్నారు. ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంద‌న్నారు. ఓ వైపు వ‌రి ధాన్యం కొన‌మ‌ని కేంద్రం చెప్పుతుంటే, మరోవైపు స్థానికి బీజేపీ నేత‌లు వ‌రి సాగు చేయాల‌ని రైతుల‌ను రెచ్చగొడుతున్నార‌న్నారు. లేనిపోని మాట‌లు చెప్పి రైతుల‌ను అయోమ‌యానికి గురి చేస్తున్నార‌ని, రాజ‌కీయాల కోసం అమాయకులైన అన్నదాత‌ల‌ను మోసం చేయ‌డం మానుకోవాల‌న్నారు. బీజేపీ నేత‌లు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రం దిగి వచ్చేవరకూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలు కేవలం ఆరంభం మాత్రమేనని వెల్లడించారు.

ఎడ్ల బండి మీదొచ్చి.. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి గంగుల

Advertisement

Next Story