కరెంటు డిమాండ్‌కు కరోనా షాక్

by Shyam |   ( Updated:2020-03-25 08:34:40.0  )
కరెంటు డిమాండ్‌కు కరోనా షాక్
X

– 700 మెగావాట్లు తగ్గిన
– ఎస్పీడీసీఎల్ పీక్ డిమాండ్
– హైదరాబాద్ లాక్‌డౌనే రీజన్

దిశ, న్యూస్‌ బ్యూరో: కరెంటు వినియోగ వృద్ధిలో ఏ ఏడాదికాఏడాది దూసుకుపోతున్న తెలంగాణ కరోనా దెబ్బకు ఒక్కసారిగా స్లో అయింది. రాష్ట్రంలో రబీసీజన్ ముగింపు దశలో ఉండడం, ఎండలు ఓ మోస్తరుగా ఉన్న మార్చి నెలాఖరులో ఉన్పప్పటికీ ప్రస్తుత రాష్ట్ర వ్యాప్త కరెంటు పీక్ డిమాండ్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే పెద్ద వృద్ధేమీ కనిపించడం లేదు. గురువారం రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 10వేల382 మెగావాట్లుగా నమోదవగా గతేడాది ఇదే రోజు పీక్ విద్యుత్ డిమాండ్ 10వేల133 మెగావాట్లుగా నమోదైంది. అంటే ఏడాదిలో వృద్ధి కేవలం 2.5 శాతంగా ఉంది. ఒకరోజు మొత్తంలో వినియోగమైన విద్యుత్ సగటును సగటు విద్యుత్ డిమాండ్‌గా, రోజులో ఏదో ఒక టైంలో నమోదయ్యే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ను ఆ రోజు నమోదైన పీక్ లేదా గరిష్ట డిమాండ్‌గా వ్యవహరిస్తారు. పీక్ డిమాండ్‌లో వృద్ధినే ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి సూచిగా పరిగణిస్తారు.

జనతా కర్ఫ్యూ నుంచి తగ్గిన పీక్ కరెంటు డిమాండ్..

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి దేశ వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూ రోజు నుంచి రాష్ట్రంలో గత సంవత్సరంతో పోలిస్తే పీక్ డిమాండ్ రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఈ కర్ఫ్యూ ముగిసే సమయానికి తెలంగాణ ప్రభుత్వం మార్చి 23 నుంచి మార్చి 31 దాకా వారం పాటు ఎపిడమిక్ చట్టం కింద రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించింది. దీన్ని ప్రధాని మోడీ తాజాగా 21 రోజులు అంటే ఏప్రిల్ 14వ తేదీ దాకా పొడిగిస్తూ ప్రకటన చేశారు. అయితే మొదటి లాక్‌డౌన్ రోజైన మార్చి 23వ తేదీ సోమవారం 11వేల 204 మెగావాట్లుగా నమోదైన పీక్ డిమాండ్ మెరుగ్గానే ఉన్నప్పటికీ లాక్‌డౌన్ రెండో రోజైన మంగళవారం ఒక్కసారిగా 10వేల379 మెగావాట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక దశలో రాష్ట్ర పీక్ విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే 30శాతం వృద్ధితో 13వేల100 మెగావాట్లపైన నమోదై ఉమ్మడి ఏపీలో నమోదైన పీక్ విద్యుత్ డిమాండ్ రికార్డును చెరిపి వేసి కొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ సంవత్సరానికి 20 శాతం చొప్పున పెరుగుతూ 6 ఏళ్లలో రెట్టింపైంది. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయ రంగంతో పాటు రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.

లాక్ డౌన్‌తో హైదరాబాద్‌లో ఒక్కసారిగా తగ్గిన విద్యుత్ వినియోగం…

కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనందున ఒక్క గృహ విద్యుత్ వినియోగం తప్ప కమర్షియల్, ఇండస్ట్రియల్ క్యాటగిరీల్లో షాపులు, పరిశ్రమలు అన్ని మూత పడడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సిటీలో విద్యుత్ పంపిణీ చేసే టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థ ( డిస్కం) పరిధిలో పవర్ పీక్ డిమాండ్ బుధవారం 5668 మెగావాట్లు నమోదు కాగా గతేడాది ఇదే రోజు ఈ డిస్కం పరిధిలో పీక్ పవర్ డిమాండ్ 6382 మెగావాట్లుగా నమోదైంది. అంటే 700 మెగావాట్ల డిమాండ్ తగ్గినట్టు స్పష్టమవుతోంది. నిజానికి హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ప్రతి ఏడాది సహజంగా ఉండే ఆర్థిక వృద్ధితో కొత్త కమర్షియల్ స్పేస్(ఆఫీసులు), పరిశ్రమలు పెరిగి కరెంట్ డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ఎస్పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్ డిమాండ్‌లో వృద్ధి కాస్తా నెగటివ్‌ జోన్‌లోకి వెళ్లింది. ఓ పక్క ఎస్పీడీసీఎల్ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్నకరీంనగర్, అదిలాబాద్, వరంగల్ లాంటి జిల్లాలకు కరెంటు పంపిణీ చేసే మరో డిస్కం టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో మాత్రం పవర్ పీక్ డిమాండ్‌లో ఇప్పటికీ 1000 మెగావాట్ల దాకా వృద్ధి నమోదవుతోంది. ఈ డిస్కం పరిధిలోని జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లు అధికంగా ఉండడం, కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజులు ఉండడమే విద్యుత్ డిమాండ్‌లో వృద్ధికి కారణంగా తెలుస్తోంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో బుధవారం పీక్ పవర్ డిమాండ్ 4486 మెగావాట్లుగా నమోదు కాగా గతేడాది ఇదే రోజు ఈ డిస్కం పరిధిలో 3431 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండు మాత్రమే నమోదైంది. అంటే 1000 మెగావాట్ల పైన విద్యుత్ వినియోగ వృద్ధి కనిపిస్తోంది. లాక్‌డౌన్‌తో రాష్ట్ర జీఎస్‌డీపీలో 50 శాతం వాటా కలిగిన హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైందని చెప్పడానికి నగరంలో పడిపోయిన విద్యుత్ డిమాండే నిదర్శనమని పలువురు విశ్లేషిస్తున్నారు. దీని ప్రభావం రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాపై స్పష్టంగా కనిపిస్తుందని వారంటున్నారు.

Tags : corona, telangana power demand, reduced growth, lockdown

Advertisement

Next Story