పార్కు.. దర్జాగా కబ్జా !

by Anukaran |   ( Updated:2020-07-09 08:34:39.0  )
పార్కు.. దర్జాగా కబ్జా !
X

దిశ, న్యూస్‌బ్యూరో: నార్సింగి.. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన మున్సిపాలిటీ. అంతకు మించి విలువైన భూములు కలిగిన ప్రాంతం. ఇక్కడే కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్లాట్లు ఉన్నాయి. అన్నింటికీ మించి అత్యంత ఎత్తయిన భవనాలు. చుట్టూ ఐటీ కారిడార్లు, పరిసరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు. కానీ చుట్టూ శాకాహారులే ఉన్నా కోడి మాయమైనట్లుగా అందరికీ పనికొచ్చే స్థలం మాయం చేస్తున్నారు. గజం రూ.లక్షకు పైగా పలికే స్థలంపై కొందరు స్థానిక నాయకులే కన్నేసి కబ్జాకు యత్నిస్తున్నారు. లే అవుట్‌లో స్పష్టంగా ఆ స్థలం పార్కుదని ఉంది. కానీ కొందరు ఖద్దరు ధరించిన పెద్దలు తమదంటున్నారు. ఏకంగా 2వేల గజాల స్థలానికి ఎసరు పెట్టారు. ఇదంతా అధికార బలమున్న నాయకత్వమే చేస్తుండడంతో స్థానికులెవరూ ఫిర్యాదు చేయడానికి, అడిగేందుకు సాహసం చేయడం లేదు.

నార్సింగి మున్సిపాలిటీ సర్వే నం.300 నుంచి 303, 306 నుంచి 311, 313 నుంచి 315 వరకు ఉన్న భూమిలో అరుణోదయ హౌజింగ్ సొసైటీ ఏర్పడింది. హుడా ఆమోదం కూడా పొందారు. దీంట్లో రెండు పార్కు స్థలాలుగా నిర్ణయించారు. ఆమోదం పొందిన లేఅవుట్‌లో వాటిని స్పష్టంగా చూపారు. అందరికీ ఉపయోగకరంగా ఉండే స్థలాన్ని లే అవుట్ చేసిన కే భగవాన్ దాస్, ఇతరులు కలిసి గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఈ మేరకు జాయింట్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ కూడా చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటి మొత్తం విస్తీర్ణం 6,078 చ.గ.లుగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పార్కులుగా పేర్కొన్న స్థలాలు కుదించుకుపోయాయి. కొంత నిర్మాణాల్లో కలిసిపోయింది. మరికొంతేమో బ్లూ షీట్లు వేసినట్లు దర్శనమిస్తోంది. అదేం మున్సిపాలిటీ అధికారులు వేయించిందేం కాదు. ప్రైవేటు వ్యక్తులు వేయించినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఐతే కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారెవరూ లేరు.

సెటిల్మెంట్ వ్యవహారం

నెల రోజులుగా పార్కు స్థలంపై స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది. నాయకులు, ఇంకొందరు కలిసి సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. కబ్జా వెనుక సూత్రదారులకు అధికార బలం ఉండడంతో ఆ కాలనీవాసులెవరూ ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు తన నియోజకవర్గ పరిధిలోని ఓ పార్కు.. అది కూడా ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని ప్రజల స్థలం కబ్జా విషయం తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పక్కాగా అది కబ్జా అని నిర్ధారణ అయ్యింది. కానీ దాని వెనుక ఉన్న వ్యక్తులను మందలించడం లేదని పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. నార్సింగి మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న కౌన్సిలర్లు కూడా మౌనం వహించడం గమనార్హం. దీంతో కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇకనైనా రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని నార్సింగి వాసులు కోరుతున్నారు.

కబ్జా నిజమే: జి.శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్, నార్సింగి మున్సిపాలిటీ

మా దృష్టికి వచ్చింది. నేనే హెచ్ఎండీఏ ఆఫీసుకి వెళ్లి లే అవుట్ కాపీ, సంబంధిత పత్రాలను తీసుకొచ్చాను. ఆ స్థలం తమదంటున్న వాళ్లు వాళ్లదిగా చెప్పుకునే ఏ పత్రాలను చూపించడం లేదు. మేం అడిగినా వాళ్లు స్పందించడం లేదు. అది ముమ్మాటికీ పార్కు స్థలమే. గుర్తించినం. అత్యంత విలువైన సదరు స్థలాన్ని కాపాడుతాం. టౌన్ ప్లానింగ్ అధికారి సెలవులో ఉండడం వల్ల కూల్చివేత ఆలస్యమైంది. త్వరలోనే ఖచ్చితంగా కూల్చేస్తాం. స్వాధీనం చేసుకుంటాం.

Advertisement

Next Story