- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనుకోవడం లేదు.. వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : ఇది ఎన్నికల ఏడాదని, అధికార యంత్రాంగాన్ని మొత్తం గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్.. ఈసారి జరిగే ఎన్నికలను సజావుగా, సక్రమంగా జరగనిస్తాడంటే ఎలా నమ్మాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అనుమానం వ్యక్తంచేశారు. ఈ అంశంపై తానే కాదని, ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ముఖ్యమంత్రిని నమ్మడంలేదని ఆమె పేర్కొన్నారు. అందుకే తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపైనే రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని శనివారం షర్మిల కలిశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయని గవర్నర్ కు వివరించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై వీధి కుక్కల్లాగా దాడులకు తెగబడుతున్నారని షర్మిల విమర్శలు చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ను బీఆర్ఎస్ నేతలు బ్రేక్ చేసి ప్రతిపక్షాలపై వేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ నియంత పాలనలో ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడనివ్వకుండా గొంతునొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి మహిళలంటే కనీస గౌరవం లేదని విరుచుకుపడ్డారు. ఈ అన్ని అంశాలను వివరించి తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లు ఆమె తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే కనిపించడం లేదని, రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ధ్వజమెత్తారు. ఆయన ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని కూడా అవమానించారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై దాడులు దారుణంగా పెరిగిపోయాయని, తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్ గా మారిందని, కేసీఆర్ తాలిబాన్ గా తయారయ్యాడన్నారు.
వీధి కుక్కలు చిన్నారిని చంపేసినా ఎలాంటి చర్యలు చేపట్టని దుస్థితికి తెలంగాణ చేరుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు దిగడం ఎంతవరకు సమంజసమని షర్మిల ప్రశ్నించారు. పోలీసులు జీతగాళ్లలాగా మారారన్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా కేసీఆర్ స్పందించకపోగా, దాడులు ఇలాగే కొనసాగించండని ప్రోత్సహిస్తున్నట్లుందని ఆమె అనుమానం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ లో నాయకులు ఎవరూ లేరని, ఆ పార్టీలో ఉన్నవారంతా గుండాలేనని ఆమె పేర్కొన్నారు. తాను విమర్శలు చేస్తే దాడులకు దిగారని, మరి బీఆర్ఎస్ నేతలు తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని, దానిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 9 ఏండ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని, ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నిలబెట్టుకున్నారని షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, దీనికి పార్టీలకతీతంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా తమతో కలిసిరావాలని ఆమె కోరారు. లాయర్ దంపతులను నడిరోడ్డుపై నరికి చంపినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని, అంతటి దుస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగాయన్నారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసేది బీఆర్ఎస్ నేతలేనని, అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నట్లుగా చెప్పారు. ఈ అంశంపై గవర్నర్ కూడా మాతో ఏకీభవించారని వెల్లడించారు. ఈ అంశంపై ఆలోచన చేస్తామన్నారని షర్మిల తెలిపారు. త్వరలో రాష్ట్రపతిని కూడా కలువనున్నట్లు ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా వైఎస్ వివేకానంద హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని పేర్కొన్నారు. సీబీఐ త్వరగా విచారణ పూర్తిచేయాలని ఆమె కోరారు. విచారణ ప్రక్రియ నిష్పక్షపాతంగా చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.