Trump: ఆలోగా బందీలను విడుదల చేయాలి.. హమాస్ కు ట్రంప్ హెచ్చరికలు

by Shamantha N |
Trump: ఆలోగా బందీలను విడుదల చేయాలి.. హమాస్ కు ట్రంప్ హెచ్చరికలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌- హమాస్‌ల (Israel-Hamas Conflict)ల యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడ్డారు. తాను అధికార బాధ్యతలు చేపట్టేలోపు బందీలను విడుదల చేయాలని నొక్కి చెప్పారు. ఫ్లోరిడాలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.‘మీ చర్చలను నేను దెబ్బతీయాలని నేను చూడట్లేదు. కానీ, నేను బాధ్యతలు స్వీకరించేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయి’ అని ట్రంప్‌ (Trump) పేర్కొన్నారు. ట్రంప్‌ గతంలోనూ హమాస్‌ను హెచ్చరించారు. జనవరి 20న తాను అధికార బాధ్యతలు చేపట్టేలోపు బందీలను విడుదల చేయాలని పేర్కొన్నారు. లేకపోతే ఈ దారుణాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తానని, చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

బందీల విడుదలపై చర్చలు

ఇకపోతే, బందీల (Hamas Hostage) విడుదలపై చర్చలు చివరిదశకు చేరుకున్నాయని మిడిల్ ఈస్ట్ లోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్‌ చార్లెస్ విట్కాఫ్‌ (Steven Charles Witkoff) మీడియాకు తెలిపారు. ‘బందీల విడుదల చర్చలు చివరిదశకు చేరుకున్నాయి. మేము ఇందులో గొప్ప పురోగతి సాధించాం. డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించే నాటికి మేము కొన్ని మంచి అంశాలను ప్రకటించాలని ఆశిస్తున్నాం. హమాస్‌ (Hamas) ఇప్పటికే బందీలను విడుదల చేయాల్సిఉంది. కానీ, చేయలేదు. ఇది ఆ సంస్థకు అంత మంచిది కాదు. అక్టోబరు 7నాటి దాడులు మళ్లీ జరగకూడదు. ఆ దాడుల్లో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాకు ఇజ్రాయెల్‌ (Israel) నుంచి చాలామంది ఫోన్ చేశారు. బందీలను త్వరగా విడిపించాలని వేడుకున్నారు. అమెరికాకు చెందిన కొందరు పౌరులు సైతం అక్కడ బందీలుగా ఉన్నారు. బందీల తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి వారి బాధను పంచుకున్నారు’ అని విట్కాఫ్ పేర్కొన్నారు. 2023, అక్టోబర్ లో ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు విడుదల కాగా.. మరికొందరు చనిపోయారు.. ప్రస్తుతం 51 మంది మాత్రమే బందీలుగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed