హనీట్రాప్‌లో 48 మంది పొలిటీషియన్స్

by John Kora |
హనీట్రాప్‌లో 48 మంది పొలిటీషియన్స్
X

- ఉచ్చులో కేంద్ర మంత్రులు

- బాంబు పేల్చిన కర్ణాటక మంత్రి రాజన్న

- ఉన్నత స్థాయి దర్యాప్తుకు డిమాండ్

దిశ, నేషనల్ బ్యూరో: 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని, వారిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి కేఎన్ రాజప్ప బాంబు పేల్చారు. మంత్రి రాజప్ప ఏకంగా అసెంబ్లీలోనే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. హనీట్రాప్‌లో చిక్కుకున్న నాయకులు ఏ ఒక్క పార్టీకో చెందిన వారు కాదని, అన్ని పార్టీల వాళ్లు ఉన్నట్లు రాజప్ప పేర్కొన్నారు. ఈ అంశంలో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 'ఈ హనీట్రాప్‌కు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్‌లలో 48 మంది రాజకీయ నాయకులు బాధితులుగా ఉన్నారు. నేను నా పార్టీ నాయకులు మాత్రమే ఉన్నారని అనడం లేదు.. ప్రతిపక్షంలో ఉన్న వారు సైతం ఇందులో ఇరుక్కున్నారు' అని రాజన్న తెలిపారు. తూంకూరుకు చెందిన ఇద్దరు శక్తివంతమైన మంత్రులు హనీట్రాప్‌లో చిక్కుకున్నట్లు నివేదికలు ఉన్నాయి. తూంకూరుకు చెందిన మంత్రుల్లో ఒకడిని నేను.. మరొకరు డాక్టర్ పరమేశ్వర. మా ఇద్దరికి సంబంధించి అనేక కథలు బయటకు వస్తున్నాయి. వాటికి నేను అసెంబ్లీలో స్పందించను అని రాజన్న పేర్కొన్నారు.

ఈ హనీట్రాప్ అంశంపై హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హనీట్రాప్ వెనుక ఎవరు ఉన్నారు? దీన్ని నడిపిస్తుంది ఎవరు? అనే విషయాలన్నీ బయటకు రావాలి. అవన్నీ ప్రజలకు తెలియాలని రాజన్న డిమాండ్ చేశారు. ఇక రాజన్న కుమారుడు ఎమ్మెల్సీ రాజేంద్ర కూడా ఈ అంశాన్ని ప్రస్థావించారు. గత ఆరు నెలలుగా రాజకీయ నాయకులను హనీట్రాప్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరగాలని కేబినెట్ మినిస్టర్ చెప్పారు. హెం మంత్రి కూడా సానుకూలంగా స్పందించి, దర్యాప్తు చేస్తారని తాను భావిస్తున్నట్లు రాజేంద్ర పేర్కొన్నారు.

బాధితులకు వాట్సప్ కాల్ లేదా మెసేజ్ పంపిస్తున్నారు. ఆ విధంగా ఇతరులను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఇది కొనసాగుతూనే ఉంది. రెండు నెలల నుంచి ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు పూర్తిగా జరిగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని రాజేంద్ర పేర్కొన్నారు. కాగా, కర్ణాటక మంత్రిపై రెండు సార్లు హనీట్రాప్ ప్రయత్నం జరిగినట్లు ప్రజా పనుల శాఖ మంతరి సతీశ్ జార్కిహోళి గతంలోనే ధృవీకరించారు. ఇది మా పార్టీకి మాత్రమే పరిమితం కాలేదని.. అన్ని పార్టీల్లో జరుగుతుందని అన్నారు.

Next Story

Most Viewed